విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: పర్యాటక రంగంలో విశాఖ జిల్లాను మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం సాయంత్రం కైలాసగిరిపై నూతనంగా చేపట్టబోతున్న త్రిశూలం ప్రాజెక్ట్ కు హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత తో కలసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి శంకుస్థాపన చేశారు.అనంతరం ఆర్కె బీచ్ రోడ్డులో సబ్మెరిన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన యుహెచ్ 3 హెచ్ హెలికాప్టర్ మ్యూజియంను హోంశాఖ మంత్రి అనితతో కలసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విశాఖను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ఆకర్షణీయమైన ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకువస్తున్నామని, అందులో భాగంగా పర్యాటక ప్రాంతం కైలాసగిరిని మరింత అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
అదేవిధంగా ఈస్ట్రన్ నావెల్ కమాండ్ విశాఖ జిల్లాలో ఉండడం మన అదృష్టమని, అందువల్ల పర్యాటక అభివృద్ధికి ఇక్కడ హెలికాప్టర్ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ హెలికాప్టర్ 2007 నుండి 2024 వరకు దేశానికి సేవ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రజల సందర్శనార్థం మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పర్యాటక రంగానికి విశాఖ జిల్లాలో ఎనలేని అవకాశాలు ఉన్నాయని, ఐటీ రంగం తో పాటు టూరిజం రంగానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్, జిల్లాకలెక్టర్ హరేందర ప్రసాద్, వి ఎం ఆర్ డి ఏ కమిషనర్ కె ఎస్ విశ్వనాధన్, ఈస్ట్రన్ నావెల్ కమాండ్ అధికారులు, వి ఏం ఆర్ డి ఏ కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్,పర్యవేక్షక ఇంజనీర్లు భవానీ శంకర్, మధుసూదనరావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar