విజయనగరం,ఐఏషియ న్యూస్: విజయనగరం పట్టణంలో అక్టోబరు 6, 7 తేదీల్లో జరగబోయే శ్రీ పైడితల్లి అమ్మవారి తోలెళ్లు, సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో క్యూలైన్ల ఏర్పాటు, భద్రత, బందోబస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టరు ఎస్.రామసుందర రెడ్డి,, జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు ఎస్.రామసుందర రెడ్డి, జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయంకు చేరుకొని, ముందుగా అమ్మవారిని దర్శించుకొని, భక్తుల దర్శనాలకు ఏర్పాటు చేయుచున్న క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం, ఆలయం పరిసర ప్రాంతాలను, దర్శనాలకు భక్తులు వచ్చి, దర్శనం అనంతరం ఆలయం బయటకు వెళ్ళే మార్గాలను పరిశీలించారు. సిరిమాను తిరిగే మార్గం అయిన మూడులాంతర్ల నుండి కోట జంక్షన్, జీయర్ కాంప్లెక్స్ వరకు కాలి నడకన వెళ్ళి, క్షేత్ర స్థాయిలో బారికేడ్లను ఏర్పాటు, భద్రత, బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి, చేయాల్సిన పనుల గురించి దిశా నిర్దేశం చేశారు.
ఉత్సవాలు, పండగలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వాహనాల పార్కింగుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ స్టాలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
హుకుంపేట నుండి ఆలయంకు సిరిమాను తీసుకొని వచ్చే మార్గంలోని జంక్షనుల వద్ద, సిరిమాను తిరిగే మార్గంలోని జంక్షనుల వద్ద బారికేడ్లను మరింత బలంగా వేయాలన్నారు.అలాగే జిల్లా కలెక్టరు,జిల్లా ఎస్పీ, ఇతర అధికారులు హుకుంపేటలోని ప్రధాన పూజారి ఇంటి వద్ద, సిరిమాను తయారయ్యే ప్రాంతాలను పరిశీలించారు. సిరిమాను తయారు చేసే ప్రాంతానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ బందోబస్తును వేయాలని అధికారులను ఆదేశించారు విజయనగరం ఉత్సవాలు, అమ్మవారి తోలెళ్లు, సిరిమానోత్సవం లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమ్మవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టరు ఎస్.రామసుందర రెడ్డి, జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ అధికారులను ఆదేశించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఆర్డీఓ దాట్ల కీర్తి, డీఎస్పీ ఆర్.గోవిందరావు, దేవాదాయశాఖ ఏసీ శిరీష, మున్సిపల్ కమీషనరు పి.నల్లనయ్య, పలువురు సిఐలు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar