అమరావతి ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుగాలి ప్రీతి కేసును సీబీఐకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ హయాంలో ఈ కేసును సీబీఐకు అప్పగించారు. అయితే దర్యాప్తు సరిగా జరగలేదని భావిస్తున్న నేపథ్యంలో మరోసారి సీబీఐకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థకు లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గురువారం రోజున జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలోనూ ఈ విషయంపై చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు 2017 ఆగస్టు 18వ తేదీన సుగాలి ప్రీతి మృతదేహం.కర్నూలులోని పాఠశాల వసతి గృహంలో కనిపించింది. సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ సుగాలి ప్రీతి మృతదేహం కనిపించడం అప్పట్లో సంచలనం రేపింది.మరోవైపు సుగాలి ప్రీతి తల్లి పార్వతి కూడా ఇటీవల ఈ విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. సుగాలి ప్రీతి కేసు వెలుగులోకి తీసుకురావటంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. కర్నూలులో జనసేన కార్యకర్తలతో కలిసి పవన్ కళ్యాణ్ పోరాటంతోనే సుగాలి ప్రీతి కేసు చర్చనీయాంశమైంది. అయితే అప్పట్లో తనకు అండగా నిలిచిన, తన పోరాటానికి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పట్టించుకోవడం లేదంటూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపిస్తున్నారు. అయితే జనసేన పోరాటంతోనే ఈ కేసు సీబీఐకు అప్పగించారని తమ పోరాటంతోనే సుగాలి ప్రీతి కుటుంబానికి స్థలం, పొలం,ఉద్యోగం కూడా వచ్చాయని పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. అలాంటి తమపై సుగాలి ప్రీతి తల్లి విమర్శలు చేయడం బాధకరమంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సుగాలి ప్రీతి తల్లి కూడా స్పందించారు.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ప్రభుత్వం ఇచ్చిన స్థలం, పొలం, ఉద్యోగం అన్నీ వెనక్కి ఇచ్చేస్తానని తన కుమార్తెను వెనక్కి తీసుకురాగలరా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు.ఈ పరిణామాల నేపథ్యంలో సుగాలి ప్రీతి కేసును సీబీఐకు అప్పగించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Authored by: Vaddadi udayakumar