- కేంద్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణలు
- మైనార్టీ వర్గానికి ఉపరాష్ట్రపతి పదవి కేటాయించాలని ప్రధాని మోడీ నిర్ణయం
(వడ్డాది ఉదయకుమార్)
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. జగదీప్ ధన్‌కర్ రాజీనామా తర్వాత కొత్త లెక్కలు తెరమీదకు వచ్చాయి. నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదలైంది. ఎన్డీయే అభ్యర్థి ఖరారు తర్వాత ఇండియా బ్లాక్ నిర్ణయం తీసుకోనుంది.ఇప్పటికే కొత్త ఉపరాష్ట్రపతిగా పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.అయితే అనూహ్యంగా దక్షిణాదికే ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.అందులోను మైనార్టీ వర్గానికి ఈ పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.ఇందుకోసం ఏపీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తికి ప్రమోషన్ ఖాయమని సమాచారం.
తెరపైకి ఏపీ గవర్నర్ పేరు
ధన్‌కర్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎంపికపైన క్రమేణా స్పష్టత వస్తోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బీజేపీ క్యాంపులో ఈ ఎన్నికపైన వ్యూహాత్మక కసరత్తు జరుగుతోంది. తొలుత ఈ పదవికి బీహార్ నుంచి ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. మిత్రపక్షంగా ఉన్న నితీష్ కుమార్ పార్టీకి ఈ పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే మారుతున్న సమీకరణాలతో మోదీ టీం కొత్త వ్యూహం అమలుకు సిద్ధమైంది. అందులో భాగంగా దక్షిణాది నేతకు ఉపరాష్ట్రపతి ఇవ్వాలని దాదాపు నిర్ణయానికి వచ్చేశారు. అందునా మైనార్టీ వర్గానికి ఈ పదవి ఇవ్వడం ద్వారా ఇండియా బ్లాక్‌ను డిఫెన్స్‌లోకి నెట్టాలనేది మోదీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇందుకోసం అనూహ్యంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పేరు తెరమీదకు వచ్చింది.
2023లో ఏపీ గవర్నర్‌గా అబ్దుల్ నజీర్
కర్నాటక రాష్ట్రానికి చెందిన నజీర్ సుదీర్ఘకాలం న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టులో ఎక్కువకాలం పనిచేసిన నజీర్ అయోధ్య తీర్పులోను భాగస్వామిగా ఉన్నారు. 2023 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. రెండున్నరేళ్ల గవర్నర్ పదవీకాలం పూర్తి చేసిన అబ్దల్ నజీర్‌ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడంపైన మోదీ క్యాంప్ కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ఉండటంతో దక్షిణాదికి చెందిన మైనార్టీ వర్గానికి ఉపరాష్ట్రపతి కేటాయించడం ద్వారా ప్రతి పక్షాలకు అవకాశం ఇవ్వకూడదన్నది మోదీ వ్యూహంగా ఉంది. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో బీహార్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల ముందు మైనార్టీ వర్గానికి ఉపరాష్ట్రపతి పదవి నిర్ణయం రాజకీయంగా కలిసి వస్తుందని ఢిల్లీ నాయకత్వం అంచనా వేస్తోంది.రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్‌గా ప్రస్తుతం ఉన్న హరివంశ్ నారాయణ్ సింగ్ కంటిన్యూ కానున్నారు.
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి తమిళనాడు లేదా పశ్చిమబెంగాల్‌కు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్డీయేకు ఎలక్టరోల్ కాలేజీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి గెలిచేందుకు అవసరమైన పూర్తి మెజార్టీ ఉంది. ఇప్పుడు తమ అభ్యర్థి విషయంలో అమలు చేసిన సమీకరణాలతో పాటుగా ఇండియా కూటమి పోటీకి అవకాశం లేకుండా చేయాలనేది మోదీ స్ట్రాటజీ.అబ్దుల్ నజీర్ పేరు ఖరారు అయితే హమీద్ అన్సారీ తర్వాత మైనార్టీ వర్గానికి చెందిన మరొకరు ఉపరాష్ట్రపతి కానున్నారు. అదే కాకుండా కర్నాటక,ఏపీ రాష్ట్రాలతో సంబంధమున్న వెంకయ్యనాయుడు తరహాలోనే అబ్దుల్ నజీర్ చరిత్రలో నిలవనున్నారు.ఈ ఎంపికపైన మరో రెండ్రోజుల్లో స్పష్టత రానుంది. ఏది ఏమైనా ఉపరాష్ట్రపతి ఏపీ గవర్నర్ కు దక్కడం ఏపీ పై ప్రధాని మోదీ కున్న అనుబంధం అర్థమవుతుందని బిజెపి శ్రేణులు పేర్కొంటున్నాయి.
Authored by: Vaddadi udayakumar