- రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
- కేజీహెచ్ లో రూ.42 కోట్లతో సమకూర్చిన వైద్య పరికరాల ప్రారంభం
- వైద్యకళాశాల విద్యార్థులతో, వైద్యులతో ఆత్మీయ సమావేశం
విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. దానిలో భాగంగానే విశాఖలోని కేజీహెచ్ తో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని, నిధులు కేటాయిస్తున్నామని, వైద్యులను, సిబ్బందిని నియమిస్తున్నామని పేర్కొన్నారు. కేజీహెచ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో సుమారు రూ.42 కోట్లతో సమకూర్చిన అధునాతన వైద్య పరికరాలను, స్క్రీనింగ్ యంత్రాలను ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. వాటిలో లీనియర్ యాక్సిలరేటర్ (రూ.25 కోట్లు), సిటీ సిమ్యులేటర్ (రూ. 9.5 కోట్లు), బ్రాకీథెరపీ (రూ.7.5 కోట్లు) ఉన్నాయి. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, డీఎంఈ డా. రఘునందన్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఐ.వాణి, అడ్మినిస్ట్రేటర్ బీవీ రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. సంధ్యాదేవి, సీఎస్ ఆర్ఎంవో డా. శ్రీహరి, ఆంకాలజీ విభాగం వైద్యాధికారులు డా. ఎం. శ్రీనివాస్, డా. శిల్ప, పాండురంగా కుమారి భాగస్వామ్యమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు గాను రూ.45 కోట్లతో, లీనియర్ యాక్సిలరేటర్, హెచ్.డి.ఆర్. బ్రాకీథెరపీ, సిటీసిమ్యులేటర్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దీంతో సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలలో సేవలు అందుతాయని, ఇప్పటి వరకు ఇక్కడ సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల, క్యాన్సర్ రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇక నుంచి కేజీహెచ్ లో ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కేజీహెచ్ తో పాటు రాష్ట్రంలోని కర్నూలులో కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, దీనికి గాను కేంద్రం ఇప్పటికే నిధులు కూడా కేటాయించిందని వివరించారు. క్యాన్సర్ లక్షణాలున్న వారిని గుర్తిoచ్చేందుకు తరలో ప్రత్యేక సర్వే చేస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ ఒక పెద్ద సవాలుగా మారిందని, 2022 ఐసీఎంఆర్ సర్వే ప్రకారం భారతదేశంలో 15 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని, 8.84 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి వెల్లడించారు. డబ్ల్యూ.హెచ్.వో. గణాంకాల (2022) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 73వేల మంది క్యాన్సర్ బారిన పడ్డారని వివరించారు. దేశంలో రోజుకు 16వేల మంది క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేశామని, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కర్నూలులో సమగ్ర క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటు చేసుందుకు గతంలో నిధులు కేటాయించామని ఉద్ఘాటించారు.క్యాన్సర్ వల్ల ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయాను
క్యాన్సర్ మహమ్మారి వల్ల మా కుటుంబంలో ముగ్గురు వ్యక్తులను కోల్పోయానని వైద్య కళాశాల సెంటినరీ భవనంలో వైద్య విద్యార్థులు, వైద్యులతో జరిగిన మీట్ – గ్రీట్ సమావేశంలో మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. తల్లి, సోదరుడు, సోదరిలను వేరువేరు సమయాల్లో ప్రాణాలు విడిచారని వివరించారు. ఈ ఘటనలు నన్నెంతగానో కలచివేశాయని, అందుకే క్యాన్సర్ మహమ్మారిపై ప్రజా ప్రతినిధిగా పోరాటం చేస్తున్నానన్నారు. ఈ రంగంలో నిష్టాతులను తయారు చేసుందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తామని, వైద్యులు, సిబ్బందికి సర్వేపై ప్రత్యేక శిక్షణా తరగతుల్ని నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అయితే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించటంలో క్యాన్సర్ను జయించటంలో వైద్యులు, విద్యార్థులు అంకితభావంతో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అలాగే వైద్యులు మైదాన ప్రాంతాలతో పాటు, గ్రామీణ, గిరిజన గ్రామాల్లో కూడా పని చేయడానికి సిద్ధంగా ఉండాలని హితవు పలికారు. రోజువారీ మార్పులు, ఆధునిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కొత్త విషయాలను నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజు, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ వైద్య వృత్తి పవిత్రమని, ప్రజలకు నాణ్యమైన సేవ అందించడంలో అంకితభావం అవసరమని పేర్కొన్నారు.కార్యక్రమాల్లో స్థానిక కార్పొరేటర్ అప్పలరత్నం, ఆంకాలజీ విభాగం వైద్యాధికారులు పి. మాధురి, పవన్ కుమార్, పుష్ప, వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar