ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి

  • సిజేరియన్ ఆపరేషన్లు ఆందోళన కలిగిస్తోంది
  • సహజ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేస్తాం
  • అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులకు హెచ్చరిక

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.అలాగే ఏపీలో సిజేరియన్‌ ఆపరేషన్లు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని వాటిలో 90 శాతం ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇలాంటి ధోరణిని ఏమాత్రం ఆమోదించదని హెచ్చరించారు.సహజ ప్రసవాన్ని ప్రోత్సహించే దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖపై ఆదేశాలు జారీ చేశారు.
సహజ ప్రసవాలకు ప్రాధాన్యం..
ఎప్పుడైనా సరే ఆపరేషన్ అంటే అది ఆపరేషనే.. భగవంతుడు ఇచ్చిన సహజసిద్ధమైన శరీరాన్ని కోయడం మంచిది కాదని సీఎం వ్యాఖ్యానించారు. ప్రసవం సహజంగా జరగడం తల్లీ బిడ్డల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయన వివరించారు. అవసరం లేని పరిస్థితుల్లో సిజేరియన్‌లను తప్పనిసరిగా నియంత్రించాలని ప్రభుత్వం దృఢంగా నిర్ణయించుకుందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు వాణిజ్య ప్రయోజనాల కోసం గర్భిణులను సిజేరియన్‌ వైపు మళ్లిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయని సీఎం మండిపడ్డారు.ఇలాగే కొనసాగితే ఆ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, అవసరమైతే లైసెన్స్ రద్దు చేసే స్థాయిలో కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆరోగ్యశాఖకు ముఖ్య ఆదేశాలు..
ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కి సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గర్భిణులకు సురక్షిత ప్రసవంపై అవగాహన కల్పించాలని.. ప్రసవానికి ముందే యోగా శిక్షణ అందించేలా చూడాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సహజ ప్రసవాల ప్రోత్సాహం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని.. ఆస్పత్రుల్లో జరిగే సిజేరియన్ శాతంపై ప్రతి నెలా సమీక్ష జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశించారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం..
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలనేది మన అందరి ఆకాంక్ష అని సీఎం అన్నారు. గర్భిణులకు సురక్షిత ప్రసవం హక్కు అని, వైద్యులు, ఆసుపత్రులు లాభాల కోసం కాకుండా బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. సహజ ప్రసవాలు ప్రోత్సాహం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని వివరించారు.
రాష్ట్రంలో గణాంకాల వాస్తవాలు..
ప్రస్తుతం రాష్ట్రంలో 98 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. వాటిలో 42 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతుండగా, మిగతావి ఎక్కువగా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. గర్భిణుల్లో అనీమియా శాతం 32 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 1.15 లక్షల మంది వైద్యులు ఉన్నప్పటికీ, సిజేరియన్ శాతం నియంత్రణలోలేకపోవడంఆందోళనకలిగిస్తోంది.మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా క్రమంగా తగ్గుతోందని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని వెల్లడించారు.యూపీ, బీహార్‌ వల్లే భారత్‌లో జనాభా బ్యాలెన్స్ అవుతోందన్నారు. ఏపీలో పీహెచ్‌సీల సంఖ్య,జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉందన్నారు.డబ్ల్యూహెచ్‌వో ప్రకారం మెడికల్‌ ఆఫీసర్లు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నారని ప్రస్తుతం రాష్ట్రంలో 1.15 లక్షల మంది వైద్యులు ఉన్నారని చెప్పుకొచ్చారు.రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా తీసుకువెళ్లే బాధ్యత వైద్యులపై ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

పోలీసులు అదుపులో దగ్గు మందు ఫార్మా కంపెనీ యజమాని

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన కోల్డ్‌రిఫ్ దగ్గు మందు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *