విజయవాడ,ఐఏషియ న్యూస్: ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈనెల 15 నుంచి అందుబాటులోకి తెచ్చింది. దీంతో మహిళలు సంతోషంగా ఉన్నా ఈ పథకం ప్రభావం ఆటో డ్రైవర్లపై తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆటోడ్రైవర్లుతమను ఆదుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఉచిత బస్సు పథకం నేపథ్యంలో తమకు కొత్తపథకం అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ మంగళవారం విజయవాడలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ చేపట్టారు.బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చే పాలకులు ఆటో కార్మికులకు ఎందుకు ఇవ్వరంటూ ఇవాళ విజయవాడలో నిర్వహించిన భారీ ర్యాలీ పాల్గొన్న ఆటో డ్రైవర్లు ప్రశ్నించారు.బడా కంపెనీల యాప్ లు, గ్యాస్, ఇన్సూరెన్స్ రేట్ల పెంపు, పోలీసు, రవాణా శాఖల పెనాల్టీలతో ఆటో రంగం కుదేలైందని వారు తెలిపారు. ఈ మేరకు నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో భారీ ఎత్తున ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ప్రదర్శన అనంతరం ధర్నా నిర్వహించారు.ఉచిత బస్సు సదుపాయంతో రోడ్డున పడ్డ ఆటో కార్మికులందరికీ 25 వేలు ఆర్థిక సహాయం అందించాలని, వడ్డీ లేని ఆటో రుణాలు ఇవ్వాలని, ఓలా, ఉబర్, రాపిడో వంటి సంస్థల దోపిడీని అరికట్టాలని,ఆటో గ్యాస్, ఇన్సూరెన్స్ రేట్లలో రాయితీలు కల్పించాలని, పోలీసు,రవాణా శాఖ పెనాల్టీలను పెంచిన జీవో 21 రద్దు చేయాలని ఆటో డ్రైవర్లు కోరారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఆటో కార్మికులను ఆదుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఉచిత బస్సు పథకానికి ఎవరు వ్యతిరేకం కాదని, కానీ స్త్రీ శక్తి పథకం, ఆటో కార్మికుల్ని ఆదుకునే సంక్షేమ పథకం కలగలిపి అమలు జరపాలని వారు కోరారు. స్త్రీ శక్తి అమలుతో పాటే ఆటో కార్మికుల సంక్షేమానికి పథకం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి మాట ఇచ్చి, తప్పారని వారు ఆరోపించారు.
Authored by: Vaddadi udayakumar