అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.హాస్పిటల్ చైర్మన్, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తుళ్లూరు సమీపంలో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. 21 ఎకరాల విస్తీర్ణంలో మూడు దశల్లో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది.మొదటి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృతశ్రేణిఆంకాలజీసేవలుఅందిస్తారు. శస్త్రచికిత్సలు, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, రోగుల సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్‌ను అమలు చేస్తారు. రెండో దశలో పడకల సంఖ్యను 1000కు పెంచి, ప్రత్యేక విభాగాలు, పరిశోధన సౌకర్యాలు ఏర్పాటు చేసి, ప్రాంతీయ రిఫరల్ సెంటర్‌గా అభివృద్ధి చేస్తారు.
2019లో ప్రారంభమైన కల..
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ అమరావతిలో ఈ ఆసుపత్రికి 2019లోనే శంకుస్థాపన జరిగినట్లు గుర్తుచేశారు. అయితే ఆ తరువాత కొన్ని “అంధకార పరిస్థితులు” ఏర్పడటంతో.. నిర్మాణ పనులు ఆగిపోయాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మళ్లీ పనులు మొదలుపెట్టినట్లు తెలిపారు. కాగా నిన్న రాత్రి భారీ వర్షం పడినా, ముహూర్తం ప్రకారం పూజలు జరిపి పనులు ప్రారంభించాం. వర్షం రూపంలో భగవంతుడు తన ఆశీస్సులు కురిపించినట్లు అనిపించిందని బాలకృష్ణ అన్నారు. అలానే దివంగత నేత కోడెల శివప్రసాద్ చేసిన సేవలను స్మరించుకున్నారు.అయితే క్యాన్సర్ ఆసుపత్రి లాభాపేక్ష కోసం కాదని,ఇది దాతల సహకారంతో నడుస్తుందని బాలయ్య వెల్లడించారు. రోగులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు వచ్చాయని,దేశంలో అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా పేరు తెచ్చుకుందన్నారు. తన తల్లి బసవతారకం కోరిక ప్రకారం అత్యాధునిక క్యాన్సర్ వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందిస్తున్నామని చెప్పారు. రేడియేషన్ కోసం అత్యుత్తమ పరికరాలను అందుబాటులోకి తెచ్చామని మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా గ్రామాలకు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. క్యాన్సర్ నిపుణులు నోరి దత్తాత్రేయ అందిస్తున్న సహకారం అమూల్యమన్నారు
.
ఎన్టీఆర్ వారసుడిగా పుట్టడం అదృష్టం..
ఎన్టీఆర్ కుమారుడిగా పుట్టడం తన అదృష్టమని బాలకృష్ణ కొనియాడారు. ఆయన నటనకు ఒక అలంకారమని.. ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని చెప్పారు. ప్రతి తెలుగు బిడ్డకు ఎన్టీఆర్ ఒక ధైర్యం అని ఆయన లాగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar