చింతపల్లి,ఐఏషియ న్యూస్: చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఎండి అనస్థీషియా విభాగానికి చెందిన డాక్టర్ సాహితి పాల్గొని, విద్యార్థులలో ప్రాథమిక వైద్య నైపుణ్యాలపై అవగాహన పెంచే దిశగా ఉపయోగకరమైన సమాచారాన్ని అందించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విజయభారతి అధ్యక్షత వహించారు. తన ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ, ప్రతిఒక్కరు సిపిఆర్ వంటి ప్రాథమిక వైద్య పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడగలుగుతారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థులలో సేవా దృక్పథాన్ని పెంపొందిస్తాయన్నారు.డాక్టర్. సాహితి సిపిఆర్ యొక్క ప్రాధాన్యతను వివరించడంతో పాటు, ఆచరణాత్మకంగా డెమో ఇవ్వడం ద్వారా విద్యార్థులకు దీని పై స్పష్టమైన అవగాహన కలిగించారు. సిపిఆర్ అవసరమయ్యే సందర్భాలు, దాన్ని పాటించాల్సిన విధానం – చెక్, కాల్, కంప్రెస్స్ అనే మూడు ముఖ్యమైన దశలను విపులంగా వివరించారు. ఆకస్మికంగా ఎవరి శ్వాస ఆగినప్పుడు లేదా హృదయ స్పందన లేకపోతే, అప్పుడు ఎలా స్పందించాలో చక్కగా వివరించారు. రియల్ టైమ్ ప్రాక్టీస్ కోసం మానికిన్ ద్వారా డెమో ప్రదర్శించటం విద్యార్థుల్లో గొప్ప ఆసక్తిని రేకెత్తించింది.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు తమ సందేహాలను అడిగి, ప్రాధమిక ప్రథమ చికిత్స పై మంచి అవగాహన పొందారు.చాలామంది విద్యార్థులు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు మాకు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో నేర్పుతాయి. ఒక ప్రాణాన్ని కాపాడగలగడం మన చేతుల్లోఉందనిఈరోజుతెలిసిందనిఅభిప్రాయపడ్డారు.
కళాశాల అధ్యాపకవర్గం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేసిన కృషికి ప్రత్యేకంగా గుర్తింపు లభించింది.ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులందరికీ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణపై బుక్‌లెట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది.ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయని, భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సంబంధిత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కళాశాల ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar