ప్రత్యేక ప్రతినిధి,ఐఏషియ న్యూస్: జీవితంలో కనీసం ఒక్కసారైనా చూడాల్సిన చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను ఒకేసారి చుట్టి రావాలి అనుకునే వారికి ఐఆర్‌సీటీసీ ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. అదే ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక పర్యాటక రైలులో ‘భవ్య గుజరాత్’ యాత్ర. మీరు గుజరాత్ వైభవాన్ని, శక్తిపీఠాలను, ఆధునిక అద్భుతాలను చూడాలని కలలు కంటున్నారా? అయితే ఈ పది రోజుల (9 రాత్రులు/10 రోజులు) ప్యాకేజీ మీకోసమే.
ఎప్పుడు మొదలవుతుంది?
ఈ ప్రత్యేక రైలు ఈనెల 26న మధ్యాహ్నం 03:00 గంటలకు రేణిగుంట రైల్వే స్టేషన్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.ఇదిదక్షిణభారతదేశంలోని ముఖ్య పట్టణాలైన గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, విజయవాడ, ఖమ్మం, కాజీపేట్, సికింద్రాబాద్ జంక్షన్, నిజామాబాద్ జంక్షన్, నాందేడ్, పూర్ణాజంక్షన్ మీదుగా సాగుతుంది.తెలంగాణ ప్రజలు ఈనెల 27న సికింద్రాబాద్ (ఉదయం 08:00), నిజామాబాద్ (ఉదయం 11:30)లలో ఈ రైలు ఎక్కే అవకాశం ఉంది.
ఏమేం చూడొచ్చు?
ఆధ్యాత్మికం నుంచి చారిత్రకం వరకు..ఈ యాత్రలో ముఖ్యంగా మూడు వేర్వేరు ప్రాంతాల వైభవాన్ని చూడవచ్చు.
ద్వారక అండ్ సోమనాథ్
12 జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్ ఆలయం, శ్రీకృష్ణుడి ఇలవేల్పు ద్వారకాధీశ్ ఆలయం, ప్రసిద్ధ నాగేశ్వర ఆలయం, మరియు పవిత్ర బేట్ ద్వారక సందర్శనతో యాత్ర మొదలవుతుంది.
చారిత్రక గుజరాత్
అహ్మదాబాద్‌లో మహాత్మా గాంధీ నివాసమైన సబర్మతి ఆశ్రమం, అద్భుతమైన నిర్మాణ శైలి గల మోడేరా సూర్యదేవాలయం, యునెస్కో గుర్తింపు పొందిన పురాతన మెట్ల బావి రాణి కి వావ్ (పటాన్) చరిత్రను కళ్లారా చూడచ్చు.
ఆధునిక అద్భుతం
ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ (ఐక్యతా విగ్రహం) ఉన్న ఎకతా నగర్‌ను సందర్శించడం ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణ.
ప్యాకేజీ సౌకర్యాలు
మీ ప్రయాణంలో రోజుకు మూడు భోజనాలు (అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం), నాణ్యమైన వసతి మరియు గమ్యస్థానాల్లో రవాణా సదుపాయం లభిస్తాయి.ప్రయాణికుల సౌకర్యార్థం ఐఆర్‌సీటీసీ సిబ్బంది ప్రతి బోగీలో అందుబాటులో ఉంటారు.
సౌకర్యాన్ని బట్టి ధరలు (ఒక్కొక్కరికి)
ఎకానమీ (స్లీపర్ క్లాస్): 18,400, స్టాండర్డ్ (3 ఏసి): 30,200, కంఫర్ట్ (2 ఏసి): 39,900 రూపాయలు టికెట్ ధర నిర్ణయించారు.తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది గుజరాత్‌లోని చారిత్రక,ఆధ్యాత్మిక,ఆధునిక అద్భుతాలను ఒక్క పర్యటనలో చుట్టి వచ్చే బంగారు అవకాశం.ఆలస్యం చేయకుండా మీ టికెట్లను నేడే బుక్ చేసుకోండి.ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందండి.
Authored by: Vaddadi udayakumar