న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఇండియా’ కూటమి సోమవారం నాడు ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.ఎన్నికల సంఘం(ఈసీ) పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావిడగా ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంపై కూటమి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా,ఎస్పీ నుంచి రాంగోపాల్ యాదవ్, ఆర్‌జేడీ నుంచి మనోజ్ ఝా, ఆప్ నుంచి సంజయ్ సింగ్ తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
లోక్ సభ రద్దు చేయాలని మహువా మొయిత్రా డిమాండ్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఎన్నికల సంఘం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గతంలో ఎన్నికలసంఘంలోపనిచేసినఅధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం రూపొందించిన ఓటర్ల జాబితాలో మోసపూరితమైనవని ఆమె ఆరోపించారు. పరిస్థితిని సరిదిద్ధడానికి ‘లోక్‌సభను వెంటనే రద్దు చేయాలి’ అని ఆమె సంచలన ప్రకటన చేశారు.
నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు: గౌరవ్ గొగోయ్
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల్లో జరిగిన అవకతవకలను ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య పెరగడంపైనా, మహాదేవపురలో ఓటర్ల జాబితాలో తేడాలపైనా, వీడియో డేటా తొలగింపుపైనా ఈసీ మౌనం వహిస్తోంది. ఎన్నికల సంఘం అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. విపక్షం చేసిన ఫిర్యాదులను పరిశీలించడం లేదని గౌరవ్ గొగోయ్ ఆరోపించారు.
బీజేపీ అధికార ప్రతినిధిలా ఈసీ: అరవింద్ సావంత్
శివసేన (యూబీటీ) నాయకుడు అరవింద్ సావంత్ కూడా ఎన్నికల సంఘంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ తీరు చూస్తుంటే, ఆయన బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోందని సావంత్ అన్నారు.మొత్తంగా, ‘ఇండియా’ కూటమి నాయకులు ఎన్నికల సంఘంపై తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని,ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వారు హెచ్చరించారు.
Authored by: Vaddadi udayakumar