- కుటుంబం మొత్తాన్ని కరోనా పొట్టనపెట్టుకుంది
- 44 ఏళ్లు వచ్చినా ఎవరూ పెళ్లిచేసుకోలేదు
- పగబట్టిన పేదరికంతో పోరాటం చేసాడు
- పట్టుబట్టి చదివి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాడు
- కంటతడి పెట్టించే రాంబాబు సక్సెస్ స్టోరీ
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు. పిల్లలను చదివించే స్థోమత లేదు.చందాలు పోగేసుకుని చదువు కన్నాడు. పేదరికం జయించడానికి ఉద్యోగం సాధించాలని నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. ప్రతి డీఎస్సీ పరీక్షల్లోనూ ఏదో ప్రమాదం ముంచుకొచ్చేది. ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారిపోయేది. కరోనా మహమ్మారి వచ్చి తండ్రిని, అక్కను, అన్నయ్యను తీసుకెళ్లి పోయింది. ఒంటరివాడైపోయాడు.నలభై నాలుగేళ్ళు వచ్చినా పిల్లని ఇస్తానన్న వాళ్ళు ఎవరూ లేరు.ఆశలన్నీ ఆవిరైపోయాయి. బియ్యం షాపులో కూలీగా పని చేసేవాడు.ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించింది. ఇతనికి చివరి అవకాశం మిగిలింది. ప్రయత్నించాలా? మానేయాలా? అనే మీమాంస. ఏదైతే అయిందని కొద్ది రోజులు పని మానేసి చదువుపై దృష్టి పెట్టాడు.కోచింగ్ సెంటర్ కు వెళ్లే ఆర్థిక స్థోమత లేదు. తెలిసిన వారి దగ్గర పుస్తకాలు తీసుకుని చదువుతూనే ఉన్నాడు.అది ఏ స్థాయిలో అంటే ఇతనిపై పగబట్టిన పేదరికం కూడా జాలిపడే లా చదివాడు.చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిది గ్రామానికి చెందిన బొమ్మాలి రాంబాబు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువు సాధించారు అది ఎలాగో పరిశీలిద్దాం. ఆయన తల్లిదండ్రులు సంగయ్య,సుజనమ్మలు సుమారు 50 సంవత్సరాల క్రితం బొబ్బిలి నుంచి ఉపాధి కోసం మండపేట వచ్చారు.అయితే మండపేట పట్టణంలో ఇంటి అద్దెలు భరించలేక సమీపంలో ఏడిద చేరుకున్నారు.తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవన సాగించేవారు.సుమారు 40 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇల్లు లేని వారికి కట్టించిన కాలనీఇల్లు (పెంకుటిల్లు)ఇచ్చారు.ఇప్పటికీ పెంకులూడిపోయిన ఆ ఇల్లే ఆధారం.
వీరికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అయితే వీరిని చదివించడం సాధ్యం కాదని పెద్దబ్బాయిని బొబ్బిలిలోని వాళ్ళు బంధువులకు ఇచ్చేశారు. ఇద్దరు అబ్బాయిలను కూలి పనులకు తీసుకెళ్లకుండా చదివించడం మొదలుపెట్టారు.అలా పదోతరగతి రాంబాబు,రమేష్ సోదరలు పూర్తి చేశారు. రాంబాబుకు రమేష్ అన్నయ్యతో పాటు స్నేహితుడు కుడా అని చెప్పాలి. మీరు వలస రావడం వల్ల వీరికి ఇక్కడ బంధువులు ఎవరు ఉండేవారు కాదు. అలాగే స్నేహితులు కూడా లేకపోవడంతో అన్నయ్యలోనే స్నేహితులను చూసుకునేవాడు.ఇంటర్మీడియట్ మండపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివేందుకు ఎంపీసీ గ్రూప్ కు దరఖాస్తు చేశారు. అయితే ఆ తండ్రి ఎంపీసీ గ్రూప్ కి ఖర్చు ఎక్కువవుతుంది చదివించలేను,సిఇసి తీసుకోమని చెప్పాడు.అయితే మండపేట కాలేజీలో ఆ సీట్లు పూర్తయి పోయాయి.దీంతో కడియం మండలం మురమండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సీఈసీ లో చేరారు.ఏడిద నుండి సైకిల్ పై మురమండ వెళ్ళి ఇంటర్మీడియట్ పూర్తి చేసారు. ఆ తర్వాత మండపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కళాశాలలో బిఎ ఉత్తీర్ణత సాధించారు. అలాగే శ్రీకాకుళంలో ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసారు.అనంతరం రాంబాబు బీఈడీకి ఎంట్రన్స్ పరీక్ష రాసారు.మచిలీపట్నం నేషనల్ కళాశాలలో సీటు వచ్చింది. కాని చదువుకోవడానికి మాత్రం డబ్బు లేవు.ఈ కుర్రాడు పరిస్థితి చూస్తుండే ఏడిది రధం వీధిలో ఉండే రాజు మాస్టర్ ప్రోత్సహించారు. బీఈడీ అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పి కొంత ఆర్థిక సాయం చేసి ఆ గ్రామ కొత్తపేట ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసే ప్రసాద్ మాస్టారుకు పరిచయం చేశారు. అక్కడ ఆ మాస్టర్ తో పాటు దుళ్ల గ్రామానికి చెందిన కంటిపూడి సత్యనారాయణ మాస్టారులు దాతలు వద్దకు తీసుకెళ్లారు. ప్రసాద్ మాస్టారు తన మోటార్ సైకిల్ పై రాంబాబుని అర్తమూరు సత్తి బులిస్వామి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్, ఆలమూరు సమతా స్వచ్ఛంద సేవా సంస్థ, రావులపాలెం రాఘవేంద్ర కంటి ఆసుపత్రికి చెందిన ట్రస్ట్ ద్వారా కొంత నిధులను సమకూర్చి బీఈడీ పూర్తి చేయడానికి కారకులయ్యారు.
అప్పటి నుంచి టీచర్ అవ్వటానికి రాంబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. 2008 డీఎస్సీ తొలి ప్రయత్నం లోనే ఎంపికయ్యాడు. సర్టిఫికెట్లు పరిశీలన కూడా పూర్తయింది.నియామక ఉత్తర్వులు రావడమే ఆలస్యం.ఇంతలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో కొందరి ఉద్యోగాలు తారుమారయ్యాయి.అటువంటి దురదృష్టవంతులలో ఈ రాంబాబు ఉండటం బాధాకరం.ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.ఇక 2012లో డీఎస్సీపరీక్షలకు సిద్దమవుతుండగా తల్లి సుజనమ్మకు గుండెపోటు వచ్చింది.ఆసుపత్రిలో తల్లిని చూసుకోవడంలో ఉండిపోయాడు. చివరకు ఆమె మరణించింది.అటువంటి పరిస్థితుల్లో ఆ పరీక్షల్లో విజయం సాధించలేకపోయారు.
అంటే అతన్ని దురదృష్టం ఏవిధంగా వెంటాడుతుందో చూడండి. 2018 డీఎస్సీ పరీక్ష సిద్దమవుతయండగా తండ్రి సంగయ్య ప్రమాదంలో కాలు విరిగిపోయింది. అతన్ని సంరక్షణ చూసుకుంటూ ఆసుపత్రిలో ఉండిపోవడం వల్ల ఆ పరీక్షల్లో కూడా గెలవలేకపోయారు.ఇతను ఎమ్‌ఎ,బిఈడీ చదవడం వల్ల పలు కాన్వెంట్లు,ప్రైవేటు స్కూల్లో పనిచేస్తూ ఉండేవారు.ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా యావత్తు ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి ఈ కుటుంబాన్ని పొట్టనపెట్టుకుంది. తండ్రి సంగయ్య, అక్క బొత్సా లక్ష్మీ, స్నేహితుడు లాంటి అన్నయ్య రమేష్ లు రెండు వారాల వ్యవధిలోనే రాంబాబు కళ్లముందే మృతి చెందారు.ఒంటరి వాడైపోయాడు.మానసిక ఒత్తిడి ఎక్కువై పోయింది.అలాంటి పరిస్థితుల్లో మరో అక్క రాజాన సుందరమ్మ ఏడిద వచ్చి రాంబాబుకు వండి పెడుతున్నారు.ఎంత చదువు చదివినా పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి. దుర్బలమైన ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నందున వీరిని చూశావారెవరు లేకుండా పోయారు.కనీసం జాలి పడేవారు కూడా లేరు. ఇతని దారిద్రం తమకు ఎక్కడ అంటుకుంటుందోనని దూరం దూరంగా ఉండేవారు.ఇటువంటిపరిస్థితుల్లో ఆలమూరు మండలం చెముడులంక హైస్కూల్ పక్కన ఉన్న గుప్తా రైస్ స్టోర్ లో పనికి చేరాడు.ఇతని చదువును చూసి ఆ యాజమాన్యం బరువు పనులు చెప్పకుండా తేలికపాటి పనుల బాధ్యతలు ఇచ్చేవారు.ఎంతో నమ్మకంగా పనిచేయడంతో వారు రాంబాబును పనివాడుగా కాకుండా ఆప్యాయతగా చూసుకునేవారు. సైకిల్ పైనే ఏడిద నుంచి చెముడులంక రోజు వెళ్లి వచ్చేవారు.ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో యాజమాన్యం కొంతకాలం పనిమానేసి చదువుకోమని సూచించారు.అయితే కోచింగ్ సెంటర్ కు వెళ్లే ఆర్థిక పరిస్థితులు లేకపోవడం వల్ల తెలిసిన వారి వద్ద పుస్తకాలు తీసుకుని రేయింబవళ్ళు చదువుతూనే ఉన్నాడు.అంటే కసి అనేదానికి చివరి దశ అన్నమాట. ఆ స్థాయిలో చదివారు. అలా చదవడం కూడా ప్రమాదమే కదా.అదే జరిగింది.ఇంట్లోనే పడిపోతూ ఉండేవాడు. ఇదేంటని ఆసుపత్రి తీసుకెళ్తే ఇతనికి ఎక్కువగా చదువుతూ ఉండటం వల్ల నిద్రలేక కంటికి రెట్టిగో అనే వ్యాధి సోకింది రెస్ట్ కావాలన్నారు.అంతే మళ్ళీ తన పని అయిపోయిందనుకున్నాడు. అలాగే మందులు వాడుతూ ఆ చదువును కొనసాగితూ వచ్చాడు.ఎక్కడా నిరుత్సాహం అనేదాన్ని తన దరిదాపుల్లోకి రానీయకుండా చూసుకున్నాడు. చివరకి అమలాపురం సమీపంలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష రాయడానికి వెళ్లాడు. పరీక్షా రాస్తూనే మధ్యలో కుప్పుకూలి పోయాడు.ఇన్విజిలేటర్లు ఏంటి విషయమని ఆరా తీశారు.పరిస్థితి వివరించాడు. మందులు వేసుకుని మళ్లీ పరీక్ష రాయడం మొదలు పెట్టాడు. ఆ విధంగా సుమారు 15 నిమిషాలు పరీక్ష సమయం వృధా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఈ పరీక్ష కూడా గెలవలేననే నిర్ణయానికి వచ్చేసారు.కాని ఫలితాలు చూస్తే పూర్తిగా రాంబాబు వైపుకు వచ్చేసాయి.ముందుగా చెప్పాను కదా ఇతన్ని వెంటాడిన పేదరికం, దారిద్రం వంటివన్నీ జాలిపడ్డాయి.ఇక అతన్ని ఇబ్బంది పెడితే అర్థమే ఉండదనుకున్నాయి. అందుకునే ఒకే పరీక్షలో రెండు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు. వాటిల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్(ఎస్సీ కేటగిరీలో 75వ రోస్టర్ పాయింట్)ను ఎంచుకున్నాడు.దీనితో పాటు టిజిటి 138 వ ర్యాంకు సాధించారు.
చూశారా.. రాంబాబు జీవితంలో ఓడిపోయి, పడిపోయి మళ్లీ లేచి ఎలా నిలబడ్డారో. యావత్తు ప్రపంచానికి చాటి చెప్పింది ఏంటంటే నిరుత్సాహాన్ని దరి చేరనీయకుండా కష్టపడి చదివితే లక్ష్యం చేరుకోవచ్చని. రాంబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కష్టాలు నుంచి బయటపడి మరి కొంతమంది యువకులకు సాయం చేసే స్థాయి చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుందాం.
Authored by: Vaddadi udayakumar