న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక నేడు జరగనున్నది. పార్లమెంట్ సభ్యులు 15వ ఉప రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలో దేశరాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎన్డీఏ- ఇండియా బ్లాక్ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకున్నాయి. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు నల్లేరు మీద నడకే. అయినప్పటికీ మెజారిటీని మరింత పెంచుకోవడంపై ఫోకస్ పెట్టింది.ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బరిలో దిగారు. ఆయనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిని పోటీకి నిలిపింది ఇండియా బ్లాక్. మంగళవారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమౌతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, లోక్ సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ తమఓటుహక్కును వినియోగించుకోనున్నారు.అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ వంటి పార్టల ఎంపీలు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో భాగం కానున్నాయి.కొత్త పార్లమెంట్ భవనంలో రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వేసిన ప్రతి ఓటుకు ఒకే విలువ ఉంటుంది. ప్రస్తుతం లోక్‌సభలో 542 మంది సభ్యులు,రాజ్యసభలో 239 మంది సభ్యులు ఉన్నారు.మొత్తం ఓటర్లు 781 మంది ఎంపీలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. గెలవడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 391. బీఆర్‌ఎస్, బీజేడీల నుండి 11మంది సభ్యులు దూరంగా ఉండటంతో మెజారిటీ మార్కు 386గా నిర్ధారించారు.మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితి, బిజూ జనతాదళ్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. దీనివల్ల గెలుపు మార్జిన్ తగ్గే అవకాశం ఉంది. బీజేడీకి- 7, బీఆర్ఎస్- 4 ఎంపీలు ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల బలం పెరిగినందువల్ల ఈసారి ఎన్నికలు మరింత హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. రాజ్యసభలో ఆరు సీట్లు, లోక్‌సభలో ఒక సీటు ఖాళీగా ఉన్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలుపుకొని ప్రస్తుతం సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతుగా 429 మంది, సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది.ఈ లెక్క ప్రకారం చూస్తే సీపీ రాధాకృష్ణన్ గెలవడం ఖాయమైంది. దీనికోసం మాక్ పోలింగ్ సైతం నిర్వహించారు.ఈ మెజారిటీనిమరింతపెంచుకోవాలని భావిస్తోంది ఎన్డీఏ,ఇండియా బ్లాక్ కు చెందిన కొంతమంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేస్తారని బలంగా నమ్ముతోంది. ఏది ఏమైనా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.త్వరలోనే బిహార్, బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ బలాన్నినొక్కిచెప్పడానికే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని నిలబెట్టాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Authored by: Vaddadi udayakumar