కశింకోట,ఐఏషియ న్యూస్: మండలంలోని నర్సింగపల్లి వీఆర్వో 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు ఏసిబి డిఎస్పి బి. వి.యస్. నాగేశ్వరరావు తెలిపారు. ఆయన తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.నరసింగపల్లి గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న సూర్య కృష్ణ పృద్వి, నరసింగపల్లి గ్రామానికి చెందిన వి నాగేశ్వరరావు అనే రైతు కు చెందిన రెండు ఎకరాల 10 సెంట్లు భూమికి ముటేషన్ దరఖాస్తు సిఫార్సు చేసి,ప్రాసెస్ చేయడానికి 20 వేలు లంచం డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో నర్సింగపల్లి సచివాలయంలో గురువారం ఆ రైతు నుంచి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు తెలిపారు.వీఆర్వో నుంచి లంచం మొత్తం స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పట్టుబడ్డ విఆర్ఓ పృద్విని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తామని తెలిపారు.ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనూ లంచాలు ఇవ్వకుండా ఇటువంటి డిమాండ్లు ఎదురైనప్పుడు వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించాలని ఏసిపి డిఎస్పి నాగేశ్వరావు విజ్ఞప్తి చేశారు.
Authored by: Vaddadi udayakumar