- ఆగస్టు 1 నుంచి ప్రక్రియ ప్రారంభం
- ఆస్తి పన్ను పేరు మార్పు కై జీవీఎంసీ కి దరఖాస్తులు అవసరం లేదు
- జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆస్తులు రిజిస్ట్రేషన్ జరిగే ప్రక్రియలోనే ఆస్తి పన్నుల పేరు మార్పు జరిపే విధానాన్ని ప్రజల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిందని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే ఇకపై ఆస్తి పన్నులు పేరు మార్పు జరిగే విధి విధానాలపై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిఐజి జి. బాలకృష్ణ, జీవీఎంసీ డిసిఆర్ ఎస్. శ్రీనివాసరావులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ అదనపు కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో భూములు, భవనములు ,అపార్ట్మెంట్లు కొనుగోలు ప్రక్రియలో భాగంగా ఇకపై సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని జీవీఎంసీ అసెస్మెంట్ కలిగిన ఆస్తులకు ఆస్తి పన్నుల పేరు మార్పు ఆటోమేటిక్ గా జరిపే అవకాశాన్ని ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం కల్పించిందని ఆయన అన్నారు. సంబంధిత ఆస్తులు రిజిస్ట్రేషన్ జరిగిన అనంతరం ఇకపై జీవీఎంసీ కార్యాలయానికి రాకుండానే ఎటువంటి దరఖాస్తు, దస్తావేజులు ఇవ్వకుండానే ఇంటి పన్నుల పేరు మార్పు చేసుకునే అవకాశం కల్పించిందని తెలిపారు.
ఈ ప్రక్రియ ఆగస్టు 1 నుండి జీవీఎంసీ పరిధిలో అమలవుతుందన్నారు. ఆస్తులు కొనుగోలు సమయంలో కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ సమయంలోనే సంబంధిత సబ్ – రిజిస్టర్ కార్యాలయంలో ఆస్తి పన్ను పేరు మార్పుకు సంబంధించి జీవీఎంసీ కి చెల్లించవలసిన మ్యుటేషన్ చార్జీలు చెల్లించవలసి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే జీవీఎంసీ రికార్డులలో ఆటోమేటిక్ గా ఆస్తి యజమాని పేరున ఆస్తి పన్ను పేరు మార్పు జరుగుతుందన్నారు. అసెస్మెంట్ నెంబర్ కలిగి రిజిస్ట్రేషన్ జరిగిన ఆస్తులకు, ప్లాట్లకు ఈ విధానం వర్తిస్తుందన్నారు. ఈ విధానం ద్వారా నగర ప్రజలు అత్యంత విలువైన సమయం ఆదాతో పాటు జీవీఎంసీ లేదా జోనల్ కార్యాలయాల వద్దకు వెళ్లవలసిన అవసరం ఉండదని, కావున నగర ప్రజలు ఈ అద్భుత సౌలభ్యం గమనించేలా జీవీఎంసీ రెవెన్యూ విభాగం ,రిజిస్ట్రేషన్ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు అందరికీ అవగాహన కల్పించాలని అదనపు కమిషనర్ తెలిపారు.
అనంతరం రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిఐజి జి. బాలకృష్ణ ,డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరగబోయే రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఆస్తిపన్నుల పేర్లు మార్పు జరిగే ప్రక్రియపై రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చిన వారికి, అలాగే జీవీఎంసీ పరిధిలో గల ఆస్తి పన్నుదారులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రక్రియ పై అవగాహన కల్పించాలని సబ్ రిజిస్టర్లకు ,జీవీఎంసీ రెవెన్యూ అధికారులకు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్రరావు, అనకాపల్లి జిల్లా రిజిస్ట్రార్ మన్మధరావు, జివిఎంసి రెవెన్యూ ఆఫీసర్లు,రెవెన్యూ ఇన్స్పెక్టర్లు,జీవీఎంసీ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ లుతదితరులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar