
నామినేటెడ్ పదవుల్లో దివ్యాంగులకు చోటు
విజయవాడ,ఐఏషియ న్యూస్: ఏపీలో దివ్యాంగులపై సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు.అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ మేరకు రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం పలు 7 కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఇకపై దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.
అంతే కాకుండా స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని తెలిపారు. ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు కూడా మళ్లీ ప్రారంభిస్తామన్నారు. బాపట్లలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అలానే శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్‌మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామన్నారు. బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తామని స్పష్టం చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్‌లో చదివే దివ్యాంగ విద్యార్ధులకు అదే చోట సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు. మరోవైపు రాష్ట్ర స్థాయిలో అమరావతిలో ‘దివ్యాంగ భవన్’ ఏర్పాటు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి,అధిక సంఖ్యలో విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News