అమరావతి,ఐఏషియ న్యూస్: కేంద్రం తాజాగా జీఎస్టీ స్లాబ్ రేట్లలో చేసిన మార్పుల్ని స్వాగతిస్తూ ఏపీ అసెంబ్లీ గురువారం ఓ తీర్మానం చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో జీఎస్టీ-2.0 సంస్కరణల్ని స్వాగతిస్తూ దేశంలో తొలిసారి తీర్మానం చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రజలకు, దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా సంస్కరణలు తెచ్చిన ప్రధానికి ఏపీ అసెంబ్లీ ధన్యవాదాలు తెలిపింది. జీఎస్టీ-2.0 రూపకల్పనలో తన వంతు పాత్ర పోషించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఈ సందర్భంగా అభినందించింది.అసెంబ్లీలో జీఎస్టీ తీర్మానంపై చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. గతంలో సీఎస్టీ,వ్యాట్ లాంటి సంక్లిష్టమైన పన్నుల వ్యవస్థ ఉండేదని,17 రకాల పన్నులు ,13 రకాల సెస్సులు సర్ ఛార్జీలు ఉండేవని బాబు తెలిపారు. ఒక ఉత్పత్తికి అనుబంధ ఉత్పత్తులు వచ్చినా పన్నులు వేసే పరిస్థితి ఉండేదని,140 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలిగేలా జీఎస్టీలో రెండు స్లాబులతో సంస్కరణలు తీసుకువచ్చిందని తెలిపారు.
Authored by: Vaddadi udayakumar