ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో దుకాణాలు,సంస్థల్లో పని గంటల పెంపునకు ఆమోదం లభించింది. ప్రస్తుతం 8 పని గంటల విధానం ఇక నుంచి మరో రెండు గంటల వరకు పెరగనుంది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ బిల్లు ఆమోదించింది. దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీల్లోనూ మహిళలను రాత్రిపూట విధులకు అనుమతిస్తారు. పనిగంటల పెంపు సమయంలో పలు నిబంధనలను స్పష్టం చేసారు. దీని ద్వారా రాష్ట్రంలోని దుకాణాలు.. సంస్థలు, ఫ్యాక్టరీల్లో ఇక పని గంటలు పెరగనున్నాయి.ఏపీ దుకాణాలు, సంస్థల సవరణ బిల్లు-2025, ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు-2025 లకు శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దుకాణాలు, సంస్థల్లో ప్రస్తుతం రోజుకు 8 పని గంటలు ఉంది. దీన్ని మరో రెండు గంటలకు అదనంగా 10 గంటలకు పెంచారు. వారానికి 48 పని గంటల్లో మాత్రం ఏ విధమైన మార్పును చేయలేదు. ఫ్యాక్టరీల్లో ప్రస్తుతం 9 పని గంటలు ఉండగా దీన్ని 10 గంటలకు పెంచారు. దాంతో మొత్తం వారానికి 48 పని గంటలే ఉంటాయి. ఫ్యాక్టరీల్లో విశ్రాంతి సమయంతో కలిపి 12 గంటలకు మించకూడదు. ప్రతి ఆరు గంటలకు అర్ధగంట విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఓవర్ టైం మూడు నెలలకు కలిపి దాదాపు 75 గంటలు ఉండగా దీన్ని 144 గంటలకు పెంచుతూ నిర్ణయించారు.
తాజా నిర్ణయంలో భాగంగా ఇక దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీల్లోనూ మహిళలను రాత్రిపూట విధులకు అనుమతిస్తారు. ప్రస్తుతం ఫ్యాక్టరీల్లో రాత్రి 7గంటలు, దుకాణాల్లో 8.30గంటల వరకు అనుమతించేందుకు అవకాశం ఉండగా దీన్ని రాత్రి 7గంటలు, 8.30 గంటలనుంచిఉదయం6గంటలవరకుఅనుమతించేలా సవరణ చేశారు.రాత్రి షిప్టు చేసేందుకు తప్పనిసరిగా ఆయా మహిళల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.ఇంటి నుంచి పని ప్రదేశం వరకు రవాణా సదుపాయం, భద్రత కల్పించాలి. దుకాణాలు, సంస్థల్లో 20 మందిలోపు సిబ్బంది ఉంటే చట్టం నుంచి మినహాయింపును ఇచ్చారు.అయితే నిబంధనలను మాత్రం పాటించాల్సి ఉంటుంది.ఈ నిర్ణయం పట్ల కార్మిక సంఘాలు,ఉద్యోగ సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.
Authored by: Vaddadi udayakumar