నాన్ స్టాప్ బస్సులకు తగ్గిన ఆదాయం: సర్వీసులు తగ్గిస్తున్న ఆర్టీసీ అధికారులు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల15వ తేదీ నుండి స్త్రీ శక్తి పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వ తీరుతో ఏపీ వ్యాప్తంగా మహిళలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో మరో కొత్త సమస్య కూడా వచ్చి పడింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తూ ఉండడంతో నాన్ స్టాప్ బస్సు సర్వీసులపైన తీవ్ర ప్రభావం పడుతుంది.
స్త్రీశక్తి పథకంతో నాన్ స్టాప్ బస్సులకు దెబ్బ
నాన్ స్టాప్ బస్సు సర్వీసులను ఎక్కడానికి గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలామంది విముఖతను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి నడిచే నాన్ స్టాప్ బస్సులు నిర్వహణ ఖర్చులు కూడా రాని విధంగా ఖాళీగా తిరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం సాధారణంగా ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రయాణం చేస్తారు.
నాన్ స్టాప్ బస్సులు పెద్దగా ఎక్కని ప్రయాణికులు
మహిళలకు ఉచిత బస్సుల్లో ఎక్కించి, పురుషులు వేరే బస్సుల్లో ఎక్కాలంటే ఆసక్తి చూపించడం లేదు. కాబట్టి మహిళలతో పాటు పురుషులు కూడా అవే బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. ఆర్డినరీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి బస్సులలో మహిళలు జీరో టికెట్ మీద, పురుషులు చార్జీలు చెల్లించి ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావం నాన్ స్టాప్ బస్సు సర్వీసులు మీద తీవ్రంగా పడుతోంది.
నష్టాల్లో నాన్ స్టాప్ బస్సులు
ప్రయాణికుల సంఖ్య తగ్గుతూ ఉండడంతో నాన్ స్టాప్ బస్సు సర్వీసులను నడపడం ఆర్టీసీకి కష్టంగా మారుతుంది. ప్రస్తుతం ఈ బస్సులు నష్టాలలో నడుస్తున్నాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కనీసం 60 శాతం మంది అయినా ప్రయాణికులు లేకపోతే బస్సులు నడపడం కష్టంగా ఉంటుందని వారు అంటున్నారు. ఇక ఇప్పటికే విశాఖపట్నం నుండి శ్రీకాకుళానికి అరగంటకు ఒకసారి ఉన్న నాన్ స్టాప్ బస్సు సర్వీసులను తగ్గించి, 45 నిమిషాలకు ఒక బస్సును నడుపుతున్నారు. అలాగే విశాఖపట్నం నర్సీపట్నం నాన్ స్టాప్ బస్సులు కూడా ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. వీటిని కూడా తగ్గించే ఆలోచనలో ఆర్టీసీ అధికారులు యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
స్త్రీ శక్తి పథకం వల్ల పల్లె వెలుగుకు తగ్గిన ఆదాయం
నిత్యం ఎస్.కోట డిపో నుంచి విశాఖపట్నం కి అధిక సంఖ్యలో బస్సులు ప్రయాణం చేస్తూ ఉంటాయి. రోజుకు లక్షలాది రూపాయలు ఆదాయాన్ని చేస్తూ ఉండేవి. అయితే స్త్రీ శక్తి పథకం ప్రవేశ పెట్టడం వల్ల ఒక్కో ఆర్టీసీ బస్సు ప్రతిరోజుకి 30 నుంచి 40 వేల రూపాయలు ఆదాయం వచ్చే సమయంలో ప్రస్తుతం మూడు నుంచి నాలుగు వేలు మాత్రమే ఆదాయం వస్తోందని అంచనా.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

డ్వాక్రా మహిళలకు “మన డబ్బులు- మన లెక్కలు” ఏఐ యాప్ ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా 83 లక్షల డ్వాక్రా మహిళలకు అందుబాటులోకి రానున్న యాప్ ఈ యాప్ వినియోగంపై మహిళలకు శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *