అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీలో మే 15వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు చెల్లించవలసిన వేతన బకాయిల సొమ్మును కేంద్రం విడుదల చేసింది. మొత్తం 1,668 కోట్ల రూపాయలను కేంద్ర ఉపాధి హామీ కూలీల కోసం విడుదల చేసింది. ఈ వేతన బకాయిలను కూలీల బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నారు.ఏపీలోని ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం ఆర్థిక భరోసాను ఇవ్వనుంది. త్వరలో మరో 137 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఉపాధి హామీ కూలీల వేతన బకాయిలు తీరనున్నాయి. కార్మికుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి. ఇది ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారికి నిజంగానే శుభవార్త అని చెప్పాలి.
ఉపాధి హామీ కూలీల సంక్షేమానికి కట్టుబడిన ఏపీ ప్రభుత్వం
అంతకుముందు ఉపాధి హామీ శ్రామికులు చనిపోతే 50 వేల రూపాయలను ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ ఎక్స్గ్రేషియాని రెండు లక్షల రూపాయలకు పెంచింది. పని ప్రదేశాలలో గాయపడి శాశ్వత వైకల్యం పొందితే ఇచ్చే పరిహారాన్ని లక్ష రూపాయలకు పెంచారు. పని ప్రదేశంలో గాయపడి శాశ్వతంగా మంచం పడితే వారికి రెండు లక్షల రూపాయల పరిహారం అందిస్తారు.
Authored by: Vaddadi udayakumar