పర్మినెంట్ ఉద్యోగి సస్పెన్షన్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి తొలగింపు
సింహాచలం,ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు ఆలయ ఈవో వి త్రినాధరావు పర్యవేక్షణలో సోమవారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉండి లెక్కింపు కార్యక్రమంలో ఇద్దరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి 55 వేల ఐదు వందల రూపాయలు దొంగలించేందుకు ప్రయత్నించారు.ఈ విషయాన్ని త్రినాధరావు సీసీ కెమెరా ద్వారా పసిగట్టారు. వివరాల్లోకి వెళితే సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉండి లెక్కింపు జరుగుతూ ఉండగా కొణతాల రమణ అనే రెగ్యులర్ ఉద్యోగి, పంచదార్ల సురేష్ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు.111(500 రూపాయల నోట్లను) ఒక కాయితంలో చుట్టి, తన వెంట తెచ్చిన సంచీలో పెట్టడాన్ని సీసీ కెమెరాల్లో ఈవో త్రినాధరావు తెలుసుకుని అక్కడే ఉన్న ఏఈఓ రమణమూర్తికి ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే ఆ ఇద్దరు ఉద్యోగుల వద్దకు ఆయన వెళ్లి వారి వద్ద నుంచి 55,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఉద్యోగులపై గోపాలపట్నం పోలీసులకు ఏఈఓ రమణమూర్తి ఫిర్యాదు చేయడం జరిగిందని ఈవో తెలియచేశారు. సింహాచలం దేవాలయ చరిత్రలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించడం ఇదే మొదటిసారి అని సిబ్బంది పేర్కొంటున్నారు. అంతేకాకుండా గతంలో కూడా కొణతాల రమణ దర్శనం టికెట్లు విక్రయం వ్యవహారంలో కూడా అవినీతి పాల్పడిన ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది.హుండీ లెక్కింపులో ఎటువంటి అక్రమాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో త్రినాధరావు హెచ్చరించారు.
Authored by: Vaddadi udayakumar