- నాలుగు కిలోమీటర్ల వరకు డోలిమోత
- కానరాని అంబులెన్సు వాహనం
చింతపల్లి,ఐఏషియ న్యూస్: నేటికీ మన్యంలో గిరిజనలకు డోళీ మోతలు చెప్పడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని దూర ప్రాంత గ్రామాలు ఇప్పటికీ రోడ్ల సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. తాజాగా పొలంబంద గ్రామానికి చెందిన నిండు గర్భిణి గెమ్మెలి మంగమ్మ ప్రసవ వేదనతో బాధపడుతున్న సందర్భంలో గ్రామస్తులు డోలిమోతే ఆధారమయ్యారు. ఆశా కార్యకర్త వంతల కాంతమ్మ సహాయంతో గ్రామస్తులు మంగమ్మను గుడ్డతో కట్టిన డోలిమోతలో మోసుకుంటూ రావిమానుపాకాల వరకు సుమారు నాలుగు కిలోమీటర్లు నడిచి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి లభించిన అంబులెన్స్ ద్వారా లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం వైద్యుల పర్యవేక్షణలో మంగమ్మ సురక్షితంగా ప్రసవం జరిపినట్లు సమాచారం. కిటుముల పంచాయతీ ఉప సర్పంచ్ సుర్ల నూకలమ్మ మాట్లాడుతూ పొలంబంద గ్రామానికి వెళ్లే మట్టి రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా ధ్వంసమైపోయింది. పెద్ద పెద్ద రాళ్లు తేలిపడి వాహనాలు వెళ్లడానికి మార్గమే లేకుండా పోయింది. అత్యవసర వైద్య పరిస్థితుల్లో గ్రామస్తులు డోలిమోత మోసుకోవాల్సి వస్తోంది. ఇది మా పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ప్రభుత్వానికి తెలియజేస్తోందని వేదన వ్యక్తం చేశారు. ఆమెతో పాటు గ్రామస్థులు కూడా రావిమానుపాకాల నుంచి పొలంబంద గ్రామానికి తారు రహదారి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. రహదారి సౌకర్యం లేని కారణంగా గర్భిణులు, వృద్ధులు, రోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై అధికార యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడూ అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడల్లా మేము మోసుకెళ్లే డోలిమోతే ఆశ్రయం. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ప్రాణ నష్టం తప్పదని మేమందరం భయపడుతున్నాం అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar