వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వారి స్వదేశాలకు పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతోంది. స్వయంగా స్వదేశాలకు వెళ్లేవారికి ఇప్పటికే నగదు ఆఫర్ చేసింది. అయితే క్రిస్మస్,న్యూఇయర్ సందర్భంగా అక్రమవలసదారులకు మరో సంచలన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఏడాది చివరిలోగా స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లే వారికి ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని ఏకంగా 3 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 31వ తేదీ లోపు అమెరికాను విడిచి వెళ్లేవారికి 3 వేల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.2.7 లక్షలు అందించనుంది. అంతేకాకుండా అలా వెళ్లిపోయే వారికి అమెరికా ప్రభుత్వమే విమాన టికెట్లకు ఛార్జీలు కూడా భరించనుంది.ఈఅవకాశాన్ని అక్రమ వలసదారులు వదులుకుంటే వారిని అరెస్ట్ చేసి శాశ్వతంగా అమెరికా రాకుండా నిషేధం విధిస్తామని తీవ్ర హెచ్చరికలు చేసింది.ఈ పథకాన్ని వినియోగించుకోవాలనుకునే వారు సి.బి.పి హోమ్ అనే మొబైల్ యాప్ ద్వారా అక్రమ వలసదారులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి సి.బి.పి హోమ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, దేశం,ఒక సెల్ఫీ ఫోటోను అప్‌లోడ్ చేయాలి. వివరాలు నమోదు చేసిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు నేరుగా సంప్రదించి ప్రయాణ ఏర్పాట్లు చేస్తారు.వారు తమ స్వదేశానికి చేరుకున్నట్లు యాప్ ద్వారా ధృవీకరించిన తర్వాత 3 వేల డాలర్ల నగదు వారి ఖాతాకు అందుతుంది.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News