చెన్నై,ఐఏషియ న్యూస్: తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అగ్ర నటుడు విజయ్ స్థాపించిన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) చుట్టూ ఇప్పుడు తీవ్ర వివాదం నడుస్తోంది. ఇటీవల కరూర్ జిల్లాలో జరిగిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటన నేపథ్యంలో మద్రాస్ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ జీ అరుల్ మరుగణ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక విచారణ చేపట్టింది. ఈ విచారణలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు న్యాయవాది నిరంజన్ రాజగోపాల్ కోర్టుకు అందించిన నివేదిక ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.న్యాయవాది వాదన ప్రకారం, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ఎన్నికల సంఘం వద్ద ఇంకా పూర్తిస్థాయి గుర్తింపు లేదు. కేవలం పేరు మాత్రమే రిజిస్టర్ అయింది, కానీ అది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదు.దీంతో, విజయ్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి అంటూ దాఖలైన అభ్యర్థన నిలబడదని ఈసీ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ వాదనతో, విజయ్ పార్టీ లీగల్ స్టేటస్‌పై నెలకొన్న గందరగోళానికి తాత్కాలికంగా తెరపడింది.
పిటిషనర్లు తమ వ్యాజ్యాలలో మరో కీలక అంశాన్ని లేవనెత్తారు. ఇకపై రాజకీయ పార్టీల ప్రచార సభల్లో మహిళలు, చిన్నారులు పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరూర్ లాంటి విషాదాలు పునరావృతం కాకుండా భద్రతా ప్రోటోకాల్‌లను కట్టుదిట్టం చేయాలని కోరారు.
Authored by: Vaddadi udayakumar