- తొక్కిసలాటలో 38 మంది దుర్మరణం..100మందికి పైగా క్షతగాత్రులు
- హుటాహుటిన కరూర్ చేరుకున్న సీఎం స్టాలిన్.. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ
చెన్నై,ఐఏషియ న్యూస్: తమిళనాట పెను విషాదం చోటుచేసుకుంది. ఒక రాజకీయ సభ మృత్యు వేదికగా మారింది. తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ శనివారం కరూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మరణ మృదంగం మోగింది. లెక్కకు మించిన జనం తరలివచ్చారు. దారులు మొత్తం కిక్కిరిసిపోయాయి. పరిస్థితి అదుపు తప్పి… తొక్కిసలాటకు దారి తీసింది. అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం… ఈ విషాదంలో 38 మంది మరణించారు. వంద మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు పిల్లలు, 17 మంది వరకు మహిళలు ఉన్నారు. 12మంది పరిస్థితి విషమంగా ఉందని… మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సీఎం స్టాలిన్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించారు.
Authored by: Vaddadi udayakumar