స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: తెనాలి ప్రాంతంలో కోడిగుడ్డు మేడంటే తెలియనివారుండరు. 107 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భవనం రాజసానికి ఠీవిగా నిలుస్తోంది.
తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో 1918లో పారేపల్లి పెదరావమ్మ తన తమ్ముడు పచ్చిపులుసు రాంపుల్లయ్య పేరిట నిర్మించారు.రాజమహల్లా ఉండాలన్న ఆలోచనతో మద్రాస్ నుంచి కార్మికులు, నిపుణులను రప్పించారని, సున్నం, కోడిగుడ్డు సొన, సహజ రంగులను ఇక్కడే గానుగ ఆడించి దానినే సిమెంటుగా వినియోగించారని, విశ్రాంత ఉపాధ్యాయుడు పారేపల్లి భార్గవరామదుర్గాప్రసాద్ వివరించారు. రెండు అంతస్తుల ఈ భవనంలో 12 గదులున్నాయి. ప్రధాన నిర్మాణం చెక్కుచెదరకుండా ఉంది. టేకుతో చేసిన దర్వాజాలు,దేవతామూర్తులు, ప్రకృతిచిత్రాల కళ ఇప్పటికీ అబ్బురపరుస్తున్నాయి.ఆ రోజుల్లో గ్రామంలోనే తొలి మేడగా పేరొందింది.కాలక్రమేణా ఈ ప్రాంతం ప్రస్తుతం మేడ సెంటర్ గా మారింది. గ్రామంలో ఇప్పుడిదే ప్రధాన కూడలి. ఇటువంటి చారిత్రక భవనాలు ప్రభుత్వం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News