
ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో సీఎం చంద్రబాబు
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: నాడు రాజకీయ శిక్షణా కేంద్రంగా ఉన్న గండిపేట ప్రాంగణం, నేడు భావితరాలను తీర్చిదిద్దే విద్యా దేవాలయంగా మారడం సంతోషకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని గండిపేటలో జరిగిన ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరితో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
విలువలతో కూడిన విద్యే అసలైన ఆస్తి
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గండిపేట ప్రాంగణంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “ఒకప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చేవాళ్లం. ఇప్పుడు అదే తరగతి గదుల్లో విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్మించుకోవడం గొప్ప పరిణామం. ఫ్యాక్షన్ గొడవలు, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల బిడ్డలకు అండగా ఉండాలనే లక్ష్యంతోనే ఈ సంస్థలను స్థాపించాం” అని పేర్కొన్నారు. కేవలం చదువు మాత్రమే కాదు, విలువలు కూడా ముఖ్యమని, విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పేదరికాన్ని జయించాలని ఆయన పిలుపునిచ్చారు.
భువనేశ్వరి నాయకత్వంలో అద్భుత ప్రగతి
నారా భువనేశ్వరి పట్టుదలతో విద్యా సంస్థలను విజయవంతంగా నడుపుతున్నారని సీఎం కొనియాడారు. “ఎన్టీఆర్ లో ఉన్న మొండితనం, పట్టుదల భువనేశ్వరికి వచ్చాయి. ఆమె నేతృత్వంలో ఈ సంస్థ 131 మంది నుండి 1,641 మంది విద్యార్థులకు చేరుకుంది. ఇక్కడి విద్యార్థులు జూనియర్ సివిల్ జడ్జీలుగా, గ్రూప్-1 అధికారులుగా ఎంపికవ్వడం గర్వకారణం” అని ప్రశంసించారు.
సేవలో ఎన్టీఆర్ ట్రస్ట్ అగ్రగామి
నారా భువనేశ్వరి మాట్లాడుతూ “మానవ సేవే మాధవ సేవ” అనే ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ట్రస్ట్ పనిచేస్తోందని తెలిపారు. తలసేమియా చిన్నారులకు ఉచిత రక్త మార్పిడి, సంజీవని క్లినిక్‌ల ద్వారా వైద్య సేవలు, స్త్రీశక్తి ద్వారా మహిళా సాధికారత వంటి కార్యక్రమాలను వివరిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
విజయగాథలు వినిపించిన పూర్వ విద్యార్థులు
ఈ వేడుకల్లో విద్యా సంస్థల వార్షిక నివేదికలను ప్రిన్సిపాల్స్ సమర్పించగా,పూర్వ విద్యార్థులు హరికృష్ణ (సినాప్సిస్ ఉద్యోగి), ఉమశ్రీ (ఎంటర్‌ప్రెన్యూర్) తమ విజయాలకు ఎన్టీఆర్ విద్యా సంస్థలే పునాది అని భావోద్వేగంగా ప్రసంగించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News