పర్లాకిమిడి,ఐఏషియ న్యూస్: గజపతి జిల్లాకు చెందిన ఆదివాసి విద్యార్థిని జ్యోత్స్న సబరో జాతీయ బాలల పురస్కారానికి ఎంపిక అయ్యారని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మునీంద్ర తెలిపారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గజపతి జిల్లా రాయగడ సమితి పేకెట్ గ్రామానికి చెందిన జ్యోత్స్న సబరో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పలు క్రీడా పోటీల్లో పాల్గొని వెయిట్ లిఫ్టింగ్ లో అద్భుతమైన విజయం సాధించిందని అన్నారు. ఈనెల 26న న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్ లో జరగబోయే ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి సమక్షంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంటారని తెలిపారు. ఈ ఏడాది భారతదేశం మొత్తం నుంచి 21 మంది బాలలు ఈ పురస్కారానికి ఎంపిక కాగా రాష్ట్రం నుంచి ఈమె ఒక్కరే ఎంపిక అయ్యారని అన్నారు. అంతే కాకుండా గజపతి జిల్లా నుండి తొలిసారిగా ఈ పురస్కారానికి ఎంపిక అయి ఎనలేని కీర్తి సాధించిందన్నారు.ఇది మన జిల్లాకు గర్వకారణమని కొనియాడారు. ఈ సందర్భంగా ఆమెను జిల్లా యంత్రాంగం ఘనంగా అభినందించి సత్కరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంరక్షణ అధికారి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News