
- ఈ ఏడాది రాజకీయంగా ఎన్నో ఘన విజయాలు
- ఉద్యోగులు,ప్రజల మన్ననలు పొందిన పవన్ కళ్యాణ్
- పవన్ కళ్యాణ్ ను ఆరాధ్య దైవంగా భావిస్తున్న గిరిజన ప్రాంత ప్రజలు
(వడ్డాది ఉదయకుమార్)
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీ ఉపముఖ్యమంత్రి,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఏడాది రాజకీయంగా ఎన్నో విజయాలు అందుకున్నారు.అంతకుమించి ప్రభుత్వ పాలనపై తనదైన ముద్ర వేశారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని పలుమార్లు ప్రశ్నించి జనసేనను రాజకీయంగా నిలబెట్టిన పవన్ ఈసారి కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా సమస్య కనిపిస్తే చాలు ప్రశ్నిస్తూనే వస్తున్నారు. ప్రభుత్వం చేసే మంచి పనుల్లో భాగస్వామి అవుతూనే మరోవైపు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి మార్గదర్శనం చేస్తున్నారు. అలాగే క్షేత్రస్ధాయిలో పర్యటనలు చేస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నారు.రాష్ట్రంలో గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో సమీక్షలకే పరిమితం అయిన పవన్ ఈ ఏడాది మాత్రం తన శాఖపై పట్టు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటూ తదనుగుణంగా అధికారులకు ఆదేశాలు ఇస్తూ సమస్యలకు పరిష్కారాలు చూపుతున్నారు. కుంకీ ఏనుగుల సమస్య పరిష్కారానికి కర్నాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి ఫలితం సాధించడం ఇందుకు నిదర్శనం.
ప్రభుత్వాన్ని కేబినెట్ లోనే ప్రశ్నించిన పవన్.. ఆ మేరకు విధానపరమైన మార్పులుతీసుకురాగలిగారు. దీంతో ముందు 44 వేల ఎకరాలు తీసుకుందామని అనుకున్న ప్రభుత్వం కాస్తా 16 వేల ఎకరాలకు తగ్గింది. అలాగే లులూ మాల్ అడిగిన రాయితీలన్నీ ఇచ్చినా బ్లాక్ మెయిల్ కు దిగడాన్ని కూడా కేబినెట్లోనే పవన్ ప్రశ్నించారు.అంతేకాదు ఇంకా పలు అంశాలపై కేబినెట్లో పవన్ వేసిన ప్రశ్నలు ప్రభుత్వ నిర్ణయాల్ని మార్చుకునేలా చేశాయి.అలాగే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామీణ ప్రాంతాల్లో పవన్ పర్యటనలు సాగాయి. అది విశాఖ మన్యంలో పర్యటన అయినా, శేషాచలం అడవుల్లో ఎర్రచందనంపై క్షేత్రస్థాయి సమీక్ష అయినా పవన్ మాత్రం దూకుడుగా ముందుకెళ్లారు.తన శాఖ పరంగా అవినీతి మరకలు లేకుండా పాలన సాగించడంలోనూ పవన్ సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకూ పవన్ నిర్వహిస్తున్న అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖలపై తనదైన ముద్ర వేశారు. కుంకీ ఏనుగుల ప్రయోగం, పల్లెపండుగల్లో విజయాలే ఇందుకు నిదర్శనం. ఆయా కార్యక్రమాలతో ప్రభుత్వంపై పవన్ పట్టు కూడా బాగా పెరిగింది.గిరిజనులకు చెప్పులు,దుప్పట్లు అందజేసి వారి ఆశీస్సులు కూడా పొందారు.
అప్పటికప్పుడే రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన పవన్
పంచాయతీరాజ్ శాఖను మెరుగు పెట్టడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో మెలుకువలు సాధించారు. అదేవిధంగా అంధుల క్రికెట్ క్రీడాకారిణి అడిగిన వెంటనే ఆమె నివసిస్తున్న ప్రాంతానికి తక్షణం రోడ్డు నిర్మాణానికి మూడు కోట్లు మంజూరు చేశారు.
అంతేకాకుండా తాజాగా కానిస్టేబుల్ నియామకం పత్రాలు అందజేసిన సమయంలో కూడా వేదిక పైనే అల్లూరు జిల్లా కానిస్టేబుల్ గ్రామానికి రెండు కోట్లు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే మంజూరు చేయడం పవన్ కళ్యాణ్ దాతృత్వానికి మరో పేరుగా మారింది. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగాఎదురుచూస్తున్న ఎంపీడీవోలను ఒక్కసారిగా పదోన్నతులు చేసి ఉన్నతాధికారులను చేసిన ఘనత కూడా పవన్ కళ్యాణ్ కి దక్కుతుంది. ఇలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల అధికారుల మన్ననలు పొందారనడంలో అతిశయోక్తి లేదు.ఇదిలా ఉండగా తన సోదరుడు నాగబాబును పట్టుబట్టి ఎమ్మెల్సీగా నియమించుకోగలడం కూడా జరిగింది. మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా కూడా బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యారని జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News