ఢిల్లీలో భారీ పేలుళ్లు 13 మంది దుర్మరణం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా భారీ పేలుడుతో ఉలిక్కిపడింది. నగరంలో అకస్మాత్తుగా నెలకొన్న ఈ హైటెన్షన్ వాతావరణం పౌరులను భయాందోళనలకు గురిచేసింది. సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో, చారిత్రక ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచిన ఒక కారులో పేలుడు సంభవించింది. బ్లాస్ట్ తీవ్రతకు ఆ చుట్టుపక్కల నిలిపి ఉంచిన ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి, మంటలు చుట్టుపక్కలకూ వ్యాపించాయి.ఈ ఘటనలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. శరీర భాగాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడిన పలువురిని హుటాహుటిన ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది, ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. మంటలను ఆర్పిన తర్వాత, పోలీసులు పేలుడుకు సంబంధించిన ఆధారాలు సేకరించడానికి యుద్ధ ప్రాతిపదికనచర్యలుప్రారంభించారు.ఫోరెన్సిక్ ,స్పెషల్ సెల్ బృందాలు ఘటనా స్థలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని, పేలుడు స్వభావాన్ని నిర్ధారించే పనిలో నిమగ్నమయ్యాయి.ఈ పేలుడు జరగడం వెనుక ఉన్న సమయం మరింత సంచలనంగా మారింది. సోమవారం ఉదయమే ఢిల్లీ పోలీసులు నగర శివార్లలో ఉగ్రవాద కుట్రను భగ్నం చేసి, ఏడుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.ఈ కీలక పరిణామం జరిగిన కొద్ది గంటల్లోనే పేలుడు సంభవించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించింది. నగరంలోని అన్ని కీలక ప్రాంతాలు , రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లు, మార్కెట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ బ్లాస్ట్ కేవలం ప్రమాదమా, లేక ఉగ్రవాద చర్యలలో భాగమా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ పేలుళ్లపై ప్రకటన
దేశ రాజధాని ఢిల్లీని కుదిపేసిన భయంకరమైన కారు పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలను, దర్యాప్తు వేగాన్ని సమీక్షిస్తూ ఆయన కీలక ప్రకటన చేశారు.
సోమవారం సాయంత్రం 6:55 గంటలకు ఎర్రకోట సమీపంలో హోండా ఐ20 కారులో ఈ పేలుడు సంభవించినట్లు హోంమంత్రి అమిత్ షా ధృవీకరించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో సహా ఉన్నతాధికారులందరితో ఆయన ఫోన్‌లో మాట్లాడారు, దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. సంఘటన స్థలాన్ని హోం మంత్రి అమిత్ షా పరిశీలించారు.
ముంబై, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో హై అలర్ట్
ఢిల్లీలో పేలుడు ఘటన జరిగిన వెంటనే, దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముంబై, హైదరాబాద్ సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాలు , ముఖ్యమైన ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించారు.పోలీసులు , భద్రతా బలగాలు గట్టి నిఘా ఉంచాయి. ఈ ఘటన దేశ భద్రతకు పెను సవాల్ విసిరింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన అధికారిక వివరాలు , దాడికి కారణమైన వారిపై త్వరలో చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *