చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా మీడియా సమావేశంలో వెల్లడి
చింతపల్లి,ఐఏషియ న్యూస్: చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ పరిధిలోని వర్తనపల్లిలో పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని పట్టుకోవటం జరిగిందని ఏఎస్పీ నవ జ్యోతి మిశ్రా తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు అన్నవరం పోలీసులు జరిపిన దాడిలో 25 బస్తాలలో నిల్వ ఉంచిన 763 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 3 కోట్లు 80 లక్షలు 88 వేలుగా పోలీసులుఅంచనా వేశారు.సీఐ వినోద్ బాబు నేతృత్వంలోని ఎస్ ఐ వీరబాబు బృందం గ్రామంలో తనిఖీలు నిర్వహించగా గంజాయి నిల్వ బయటపడిందన్నారు. స్మగ్లర్లు పారిపోవడానికి ప్రయత్నించగా ఏడుగురిలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు గంజాయి బస్తాలతో పాటు ఒక బొలెరో వాహనం, నిందితుల వద్ద ఉన్న నాలుగు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని ఏ ఎస్ పి తెలియజేశారు. గంజాయి స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో సీఐ వినోద్ బాబు అన్నవరం ఎస్ ఐ వీరబాబు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి రవాణా చేస్తున్న నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఏఎస్పి అభినందించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News