21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

తిరుమల,ఐఏషియ న్యూస్: కలియుగ దైవం, వడ్డీకాసుల వాడు,ఏడుకొండల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి.. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమలకు రానున్నారు. ఈ నెల 21న రాష్ట్రపతి స్వామివారి సేవలో పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ద్రౌపదీ ముర్ము తిరుపతికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల‌ 20న రాష్ట్రపతి ముందుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటారు.ఆ తర్వాత అక్కడి నుంచి తిరుమలకు చేరుకుంటారు. మరుసటి రోజు ఈనెల 21న ఆలయ సంప్రదాయం ప్రకారం.. మొదట శ్రీ వరాహస్వామి వారిని, ఆ తర్వాత శ్రీవారి దర్శనం చేసుకుంటారు.
రాష్ట్రపతి దర్శన ఏర్పాట్లపై సమీక్ష
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు.ఈ మేరకు గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ఉన్నతస్థాయి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో సీవీఎస్ఓ మురళీకృష్ణతో పాటు ఇతర విభాగాల అధిపతులు పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భద్రత, వసతి, దర్శన ఏర్పాట్లపై వారు చర్చించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా.. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు అదనపు ఈవో ఆదేశాలు జారీ చేశారు.ఈ సమావేశంలో ఎస్వీబీసీ సీఈఓ ఫణికుమార్ నాయుడు, సీఈ సత్యనారాయణ, అదనపు ఎస్పీ రామకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

హిందూ దేవాలయాలకు రాయితీపై దేవత విగ్రహాలు,మైక్ సెట్,గొడుగులు,శేష వస్త్రాలు విక్రయం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *