
- థింసా నృత్యం చేసి పండగ చేసుకున్న ఆదివాసీలు
- డీఈవో, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఘన సత్కారం
కొయ్యూరు,ఐఏషియ న్యూస్: తమ గ్రామంలో కొత్తగా పాఠశాల ప్రారంభం కావడంతో గ్రామస్తులంతా థింసా నృత్యాలతో హోరెత్తించారు. చిన్నారులు చిందులేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ జాజులుబంధ గ్రామంలో 30 కొందు గిరిజన ఆదివాసీ కుటుంబాలున్నాయి. ఇక్కడ పాఠశాల భవనం లేకపోవడంతో 2023-24లో గ్రామస్తులే స్వయంగా షెడ్డు నిర్మించారు. మాతృభూమి అనే స్వచ్ఛంద సంస్థ రూ.1.35లక్షలతో విద్యా సామగ్రిని సమకూర్చింది. ఆ సంస్థ నిర్వాహకులు పుస్తకాలు పంపిణీ చేశారు. అయితే అన్నీ ఉన్నా తమకు ఉపాధ్యాయుడు మాత్రం లేరంటూ కొన్నాళ్లగా గ్రామస్తులు ఆందోళన చేస్తూ వచ్చారు. దీంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. తక్షణమే జాజులబంధ గ్రామానికి స్కూల్ ఏర్పాటు చేయాలంటూ ఏపీ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీని ఆదేశించింది. ఫలితంగా గురువారం డీఈవో పి. బ్రహ్మాజీరావు, ఆల్టర్‌నేట్ స్కూల్ కో`ఆర్డినేటర్ జె. కూర్మారావు, ఎంఈవో ఎల్.రాంబాబు, గ్రామ సర్పంచ్ ఆర్.వెంకటలక్ష్మి, మండల కో`ఆర్డినేటర్ కోటిలింగం పడాలి, పంచాయతీ సెక్రటరీ ఎస్. రవీంద్రతో పాటు సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు తదితరులు గురువారం ఆ స్కూల్‌ను ప్రారంభించారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పండగ చేసుకుంటూ ఆనందంగా గడిపారు. తమ గ్రామానికి స్కూల్ రావడంతో నూతన విద్యా కమిటీ చైర్మన్ మర్రి కామేశ్వరరావు. గ్రామ పెద్ద కొండతాంబలి వెంకట్రావు తదితరులు ఆనందం వ్యక్తం చేశారు.డీఈవో, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఘన సత్కారం చేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News