శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైన వరాలు అందుతున్నాయి. కేంద్ర మంత్రిగా ఏపీ నుండి రామ్మోహన్ నాయుడు ఉండడంతో ఆయన తన శాఖ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి చేయగలిగినంత చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో కొత్త కార్గో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ధ్రువీకరించారు.
పలాస కార్గో ఎయిర్ పోర్ట్ పై ప్రజాభిప్రాయ సేకరణ
పలాస కార్గో ఎయిర్పోర్ట్ పైన స్థానికులు అపోహలు వీడి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. కార్గో విమానాశ్రయ నిర్మాణం పైన ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రాజెక్టు వస్తే దాదాపు 5 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.
ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై రైతులతో మాట్లాడిన మంత్రులు
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే ఇన్స్టిట్యూట్లో కార్గో విమానాశ్రయ నిర్మాణం పైన జరిపిన అభిప్రాయ సేకరణలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు,పలాస ఎమ్మెల్యే శిరీష తో పాటు పలువురు అధికారులు నేతలు పాల్గొన్నారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని వారు రైతులకు తేల్చిచెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని వెల్లడించారు.
Authored by: Vaddadi udayakumar