విదేశీ విద్య కోసం “కలలకు రెక్కలు” నూతన పథకం

  • విదేశీ విద్య కోసం పాలవడ్డీకే రుణాలు
  • సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యా వ్యవస్థలో అనేక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే కాకుండా, బాగా చదువుకోవాలని ఆశ ఉన్న వాళ్లకు అనేక పథకాలను అందిస్తోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ లో మన్యం జిల్లా బామినిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చెయ్యాలనుకునే వారికి భారీ శుభవార్త
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి భారీ శుభవార్త చెప్పారు. ఎవరైతే విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకుంటారో వారికోసం “కలలకు రెక్కలు” అనే పథకాన్ని రూపొందించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ పథకం కింద పావలా వడ్డీకే రుణాలు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కోరిక ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం కలలకు రెక్కలు అనే పథకాన్ని అందిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.
పథకం ఉద్దేశం చెప్పిన సీఎం చంద్రబాబు
ముఖ్యంగా యువతకు ఉన్నత విద్య, నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగాలు లక్ష్యంగా ఈ పథకాన్ని అందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. అత్యాధునిక విద్య కోసం ఉపాధ్యాయులకు కూడా నైపుణ్యం పెంపొందించడానికి విదేశాలలో శిక్షణ ఇప్పిస్తున్నాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారని గుర్తు చేసిన చంద్రబాబు రాష్ట్ర విద్యార్థులు కూడా అదే స్థాయికి ఎదగాలని, అలా వారిని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
లోకేష్ కు విద్యాశాఖ బాధ్యతలు అందుకే
ఏపీ విద్యాశాఖకు నూతన ఒరవడి తెస్తానని లోకేష్ సంకల్పించడం వల్లే తనకు విద్యాశాఖ బాధ్యతను అప్పగించాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు వేధింపులకు గురయ్యారని చంద్రబాబు ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వారిని గౌరవించడం ప్రథమ కర్తవ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
2026లో స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్
2026 జనవరిలో విద్యార్థులలో సృజనాత్మకతను ప్రోత్సహించే విధంగా స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్ ను నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సదస్సు యువ ఆవిష్కర్తలకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రతిభావంతులను ప్రోత్సహించటం కోసం షైనింగ్ స్టార్స్ కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
విద్యార్థులుగా మారి తరగతి గదిలో కూర్చున్న తండ్రి, తనయులు
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్ధులతో కొద్దిసేపు ముచ్చటించారు. క్లాస్ రూమ్ లో కూర్చుని ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ఆలకించారు.ఉపాధ్యాయుడుగా మారి చంద్రబాబు నాయుడు పిల్లలకు పాఠాలు చెప్పడం జరిగింది.విద్యార్ధులకు ఇచ్చిన లెర్నింగ్ టూల్స్ పరిశీలించారు.
విద్యార్ధుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి, వారి తల్లితండ్రులతో సీఎం, చంద్రబాబు మంత్రి లోకేష్ మాట్లాడారు.పాఠశాల విజిటర్స్ బుక్ లో సీఎం చంద్రబాబు సంతకం చేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

అంగన్వాడి కార్యకర్తలకు ఉచిత స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: అంగన్వాడీ కార్యకర్తలకు ఉచిత మొబైల్ ఫోన్స్ (5జి టెక్నాలజీ) 12,500 ఖరీదైన మొబైల్ ఫోన్స్ ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *