ఏపీకి 13 లక్షల కోట్లు పెట్టుబడులు: సీఎం చంద్రబాబు ప్రకటన

ముగిసిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే విశాఖ వేదికగా 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శనివారంతో దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక టౌన్‌షిప్‌గా ఉన్న శ్రీసిటీలో ఏర్పాటు చేసిన మరికొన్ని యూనిట్లను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు.శ్రీసిటీలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన పలు కంపెనీలతో 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా దాదాపు 12,365 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.అంతే కాకుండా శ్రీసిటీకి అదనంగా 6 వేల ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు వెల్లడించారు. శ్రీసిటీని రాష్ట్ర అభివృద్ధికి ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. డైకిన్‌, ఇసుజూ, క్యాడ్‌బరీ వంటి అంతర్జాతీయ సంస్థలు శ్రీసిటీ నుంచే తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. త్వరలోనే 1.5 లక్షల ఉద్యోగాలతో శ్రీసిటీ అభివృద్ధికి ఒక నమూనాగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.2028 నాటికి దీనిని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా జరిగిన సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొత్తంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని చంద్రబాబు వివరించారు. మరోవైపు రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. 2014-19 మధ్య కాలంలోనే కియా కార్ల ఫ్యాక్టరీని సీమకు తెచ్చామని ఇప్పుడు అదే ప్రాంతంలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు.రూ.3,500 కోట్లకు పైగా పెట్టుబడులు..
అలానే రేమాండ్స్ గ్రూప్‌కు చెందిన 3 ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. రేమాండ్స్ గ్రూప్ రాష్ట్రంలో మొత్తం రూ.1,201 కోట్ల పెట్టుబడితో మూడు ప్రాజెక్టులను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనుంది. రాప్తాడులో రూ.497 కోట్లతో సిల్వర్ స్పార్క్ అపారెల్ పార్క్, గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ ప్లాంట్.. టెకులోడు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్లను నెలకొల్పనుంది.అనంతపురం జిల్లాకు రేమాండ్స్ సంస్థ రావడం శుభపరిణామమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రేమాండ్స్ సంస్థ 2027 నాటికి తమ ప్రాజెక్టులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. విమానాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో రేమాండ్స్ ఉత్పత్తులు తయారు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా రేమాండ్స్ గ్రూప్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆ సంస్థ ప్రతినిధి గౌతమ్ మైనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ఏపీలో పరిశ్రమలకు అనుమతులు చాలా వేగంగా లభిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమాల్లో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సీఎస్ కె.విజయానంద్, శ్రీసిటీ ఎండీ రవి సానారెడ్డి, సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

పూర్ణమార్కెట్ లో అగ్నిప్రమాదం: పలు పూజ సామాగ్రి దుకాణాలు దగ్ధం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ పూర్ణమార్కెట్లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆకస్మికంగా చెలరేగిన ఈ మంటలు వలన మార్కెట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *