కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు వచ్చే జనవరిలోగా పూర్తి చేస్తాం

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఏకకాలంలో అనేక రైల్వే ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పైన కేంద్రం దృష్టి సారించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు 75శాతం పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ: కిషన్ రెడ్డి
నేడు కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్‌ను కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతోందని అన్నారు. 2023లో కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారని, పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కీలక విషయాలు చెప్పిన కిషన్ రెడ్డి
రూ. 521 కోట్ల వ్యయంతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోందన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో జరుగుతున్న వివిధ విభాగాల నిర్మాణాల తీరు తెన్నులను వివరించారు. ఆర్ ఎం యులో 16కోచ్ ఎం ఈ ఎం యు రేక్‌లను తయారు చేయాలని ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. రాబోయే రైల్వే తయారీ యూనిట్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు అభివృద్ధిని సాధిస్తున్నాయన్నారు.
ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు
వందే భారత్ రైళ్లు, కొత్త రైళ్లు, అమృత్ స్టేషన్లు, విద్యుదీకరణ,కే ఏ వి ఏ సి హెచ్ మొదలైనవి శరవేగంగా అమలు జరుగుతున్నాయన్నారు. అంతకుముందు కిషన్ రెడ్డి వరంగల్ రైల్వే స్టేషన్ ను పరిశీలించారు. స్టేషన్లో అందిస్తున్న ప్రయాణికుల సౌకర్యాలపైన అధికారులతో సమీక్షించారు. తెలంగాణలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనుల పైన ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 40 రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి
సింగిల్ లైన్ ఉన్నచోట డబుల్ లైన్స్ గా మార్చడం, డబుల్ రైల్వే లైన్స్ ఉన్నచోట థర్డ్ లైన్ పనులు చేయడం, రైల్వేస్టేషన్ల రూపురేఖలను మార్చడంతో పాటు, కొత్త రైల్వే స్టేషన్లను, కొత్త రైళ్లను ఏర్పాటు చేయడం వంటి చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు. 2026 జనవరి నెలలో కొమురవెల్లి రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

విశాఖ స్టీల్ ప్లాంట్లో 3వ విడత వి.ఆర్.ఎస్ కు నోటిఫికేషన్

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ స్టీల్ ప్లాంట్ లో 3వ విడత వి ఆర్ఎస్ పథకాన్ని యాజమాన్యం బుధవారం ప్రకటించింది. 2027 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *