కేజీహెచ్ లో అంధకారం: ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ సీఎం జగన్

తాడేపల్లి,ఐఏషియ న్యూస్: ప్రతిష్ఠాత్మక విశాఖ కేజీహెచ్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా రోగులు అంధకారంలో మగ్గిపోయారు. తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఉత్తరాంధ్ర ప్రాంత పేదలకు పెద్ద దిక్కు అయిన విశాఖపట్నం కేజీహెచ్‌ ఆస్పత్రిని నిర్వహించలేని దౌర్భాగ్యస్థితిలో ప్రభుత్వం ఉందని జగన్ ధ్వజమెత్తారు. విజన్‌ గురించి, ఆన్ లైన్ పరిపాలన గురించి సచివాలయంలో కూర్చుని చంద్రబాబు రొటీన్‌ డైలాగులు చెప్తున్న పరిణామాల మధ్య, ఈ పెద్దాసుపత్రిలో కరెంటు పోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? ఇంత నిర్లక్ష్యం దేనికి? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఇలా భ్రష్టు పట్టిస్తారా? అని నిలదీశారు.కేజీహెచ్ లో గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు కరెంటు పోతే రాత్రి 12:30 వరకూ పట్టించుకునే నాథుడు లేడని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 12 గంటలపాటు చిన్నపిల్లలు, గర్భిణీలు, రోగులు అష్టకష్టాలు పడ్డం, ఆపరేషన్లు చేయించుకున్నవారి పరిస్థితి మరింత హృదయవిదారకంగా ఉండడం, కొవ్వొత్తులు, సెల్ ఫోన్ వెలుతురులోనే రోగులకు సేవలందించాల్సిన దుస్థితి రావడం, ఇవన్నీ చంద్రబాబు రొటీన్ డైలాగులు, డ్రామాల మధ్య మీకు కనపడకపోవడం దారుణమని పేర్కొన్నారు.2,000 పడకలు ఉన్న ఆస్పత్రిలో 1,700 మంది ఇన్ పేషెంట్లు ఉన్నారని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న కనీస స్పృహ ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. 12 గంటల పాటు స్పందించలేదని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్స్ నిర్వీర్యం, పీహెచ్సీలు నిర్వీర్యం,ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు రద్దు, సీహెచ్సీల్లో స్పెషలిస్టు డాక్టర్ల తొలగింపు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో, టీచింగ్ ఆస్పత్రుల్లో నాడు-నేడు పనులు నిలిపేసిందని గుర్తు చేశారు.
సిబ్బంది విషయంలో జీరో వేకెన్సీ పాలసీకి మంగళం, ఆరోగ్య శ్రీకి బకాయిలు, ఆరోగ్య ఆసరా మాయం, 108, 104ల పరిస్థితి ఘోరం, చివరకు ఆ 104,108 కాంట్రాక్టులను మీ పార్టీ సభ్యుడికి అవినీతికోసం కట్టబెట్టి, ఇన్నిరకాలుగా ప్రభుత్వ వైద్యరంగాన్ని సర్వనాశనం చేసి, ఇప్పుడు కేజీహెచ్ లాంటి ఆస్పత్రులను కూడా దెబ్బతీస్తున్నారని జగన్ మండిపడ్డారు. తాము తెచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరంచేస్తూ అంతకు మించి హాని చేస్తున్నారని విమర్శించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేదించండి

కేంద్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సూచన చెన్నై,ఐఏషియ న్యూస్: సోషల్ మీడియా వినియోగం పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *