
- సామాన్య భక్తులకు పెద్దపీట వేయనున్న టీటీడీ
- టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయం
తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అత్యవసర సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షత వహించారు. పాలక మండలి సభ్యుడు, కార్యనిర్వాహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో వైకుంఠ ఏకాదశి దర్శనాలపై ముఖ్యంగా చర్చించారు.డిసెంబర్ 30 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ఉత్తర ద్వార దర్శనంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానించింది.10 రోజుల్లో మొత్తం 182 గంటల పాటు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించాల్సి ఉండగా ఇందులో 90 శాతం అంటే 164 గంటల పాటు సామాన్య భక్తులకే కేటాయించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో- సామాన్య భక్తులకు పెద్దపీట వేసినట్టవుతుందని బీఆర్ నాయుడు తెలిపారు.వైకుంఠ ద్వారం ఏర్పాటైన మొదటి మూడు రోజులు 300 రూపాయలు, శ్రీవాణి కోటా టికెట్ల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.జనవరి 2 వ తేది నుండి 8వ తేది వరకు రోజుకు రూ.300 దర్శన టిక్కెట్లు- 15,000, శ్రీవాణి దర్శన టికెట్లు- 1,000 రెగ్యూలర్ పద్ధతిలో టీటీడీ మంజూరు చేయనుంది.ఇందులో కూడా మొదటి మూడు రోజులకు ఈ- డిప్ ద్వారా టికెట్ల కేటాయింపు ఉంటుంది.ఈ నెల 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించింది. డిసెంబర్ 2వ తేదీన డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లను కేటాయిస్తారు.టీటీడీ వెబ్ సైట్, యాప్, వాట్సాప్ ద్వారా పారదర్శకంగా టోకెన్ల జారీ, రిజిస్ట్రేషన్లకు అవకాశం.జనవరి 6, 7, 8 తేదీల్లో తిరుమల, తిరుపతి స్థానికులకు రోజుకు 5,000 టోకెన్లు మంజూరు చేస్తుంది టీటీడీ.ఆన్ లైన్ లో ముందు బుక్ చేసుకున్న వారికి ముందు ప్రాతిపదికన టోకెన్లు అందుతాయి.10 రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దయ్యాయి. ప్రతిఒక్క భక్తుడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని టీటీడీ పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News