తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల శ్రీవారి భక్తులు టీటీడీ అనుబంధ ఆలయాలను కూడా దర్శించుకుంటారు. అలాగే దేశవ్యాప్తం ఉన్న 60 టీటీడీ ఆలయాలకు కూడా భక్తులు వెళుతుంటారు. వీరి కోసం సులభతరంగా యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలుగా కియోస్క్ మిషన్లు, క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో సీనియర్ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వెనుకబడిన ప్రాంతాల్లో టీటీడీ నిర్మించదలచిన ఐదువేల ఆలయాలకు గాను అవసరమైన రెండు, మూడు డిజైన్లు సిద్ధం చేయాలని సీఈని ఆదేశించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణ ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు.తిరుపతిలోని వినాయక నగర్ వద్ద ఉన్న టీటీడీ స్టాఫ్ క్వార్టర్స్ ఆధునీకరణ పనులను త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులను కూడా వేగవంతం చేయాలి.అదేవిధంగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలి. అప్పలాయగుంట ఆలయం వద్ద భక్తులకు సమాచారం తెలిసేలా సమాచార సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. శ్రీవారి ఆలయంలో ఉన్న కదిలే వంతెన మరమ్మతు పనులను వైకుంఠ ఏకాదశిలోపు పూర్తి చేయాలి. ముంబైలోని బాంద్రా ఆలయంలో జేఈవో, చీఫ్ ఇంజనీర్,సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News