గోదావరి నదిఒడ్డున తవ్వకాలు “సింహంపై కూర్చున్న దుర్గాదేవి” విగ్రహం ప్రత్యక్షం

మంచిర్యాల,ఐఏషియ న్యూస్: మంచిర్యాల జిల్లా, ముల్కల ప్రాంతంలో గోదావరి నది ఒడ్డున అరుదైన అమ్మవారి విగ్రహం బయటపడడం స్థానికంగా పెద్ద సంచలనం సృష్టించింది. సింహంపై కూర్చున్న దుర్గాదేవి విగ్రహం లభ్యం కావడంతో ఆ ప్రాంతమంతా భక్తిభావంతో నిండిపోయింది. ఈ అద్భుతాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో.. గోదావరి నది ఒడ్డున జనసందోహం నెలకొంది.
అయోధ్య పూజారి సూచనతో తవ్వకాలు..
అమ్మవారి విగ్రహం బయటపడడం వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఇటీవల..ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యరామ మందిరం పూజారీతో పాటు పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు గోదావరి పరిక్రమ యాత్రను చేపట్టారు.ఈ యాత్ర మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా.. ముల్కల గోదావరి నది వద్ద పుష్కరఘాట్‌కు వెళ్లే మార్గంలో ఒక ప్రదేశాన్ని చూపించి, ఈ ప్రాంతంలో ఏదో తెలియని శక్తి ఉందని వారు గ్రామస్తులకు చెప్పినట్లు తెలిసింది.ఈ స్థలం ప్రైవేట్ భూమి కావడంతో ఆ యజమాని నుంచి అనుమతి తీసుకున్న తర్వాత స్వామీజీలు, గ్రామస్తులు ఆ ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభించారు.తవ్వకాలకు ముందు వారు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. తవ్వకాలు జరుపుతుండగా అనుకోకుండా ఆ ప్రాంతంలో “సింహవాహిని దుర్గాదేవి” విగ్రహం ప్రత్యక్షమైంది.అమ్మవారి విగ్రహం బయటపడడంతో భక్తులు,గ్రామస్తులు అత్యంత భక్తిభావంతో మునిగిపోయారు. భక్తులు విగ్రహానికి పసుపు, కుంకుమలతో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు, పూజించడానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రజలు క్యూలైన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. జనసందోహాన్ని అదుపు చేయడం పోలీసులకు కూడా కష్టంగా మారింది.తమ గ్రామంలో అమ్మవారి విగ్రహం వెలుగులోకి రావడం మహదాద్భుతంగా,తమ అదృష్టంగా గ్రామస్తులు పేర్కొన్నారు. స్వామీజీలు ఈ ప్రాంతంలో దేవాలయం కూడా ఉందని సూచించడంతో గ్రామస్తులు జేసీబీల సహాయంతో మరింత లోతుగా తవ్వకాలు జరుపుతున్నారు. పురాతన దేవాలయం ఆనవాళ్లు లేదామరేదైనాపురాతనవిగ్రహాలుబయటపడతాయేమోనని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో ధార్మిక వాతావరణాన్ని మరింత పెంచింది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

హిందూ దేవాలయాలకు రాయితీపై దేవత విగ్రహాలు,మైక్ సెట్,గొడుగులు,శేష వస్త్రాలు విక్రయం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *