హెల్మెట్ లేకపోతే అల్లూరి జిల్లాలో నో ఎంట్రీ

పాడేరు,ఐఏషియ న్యూస్: హెల్మెట్ లేకపోతే పోలీసులు ఫైన్ విధిస్తారని మాత్రమే మనకు తెలుసు.కానీ హెల్మెట్ లేకపోతే ఆ జిల్లాలోకి ఏకంగా ఎంట్రీయే లేదు,అదేంటి హెల్మెట్ లేకపోతే రానివ్వరా అని అంటే, కచ్చితంగా రానివ్వరు. ఎందుకంటే జిల్లాకలెక్టర్ అధికారులకు అలాంటి ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్ మాత్రమే కాదు.. మందు తాగి డ్రైవింగ్ చేసే వారికి కూడా ఆ జిల్లాలోకి నో ఎంట్రీ. రహదారి ప్రమాదాల కారణంగా నిత్యం వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఏపీలోని ఓ జిల్లా కలెక్టర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అధికారులను కూడా ఆదేశించారు. అయితే ఈ నిర్ణయాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలు చేస్తారనేదీ ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి.. రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు బలి కాకూడదనే ఉద్దేశంతో కీలక ఆదేశాలు జారీ చేశారు. ద్విచక్రవాహనదారులు అల్లూరి జిల్లాలోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు.రహదారి ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన చర్యలుచేపట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్లో సోమవారం రహదారి భద్రతపై సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మాట్లాడిన కలెక్టర్ దినేష్ కుమార్.. అధికారులకు పలు సూచనలు చేశారు. బైక్ మీద వచ్చేవారు హెల్మెట్‌ ధరిస్తేనే జిల్లాలోకి అనుమతి ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.
మద్యం తాగి వాహనం నడిపే వారికి జిల్లాలోకి అనుమతించవద్దు
మద్యం తాగి వాహనాలు నడిపేవారిని అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి అనుమతించొద్దని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వీటితో పాటుగా జిల్లా, మండల కేంద్రాలలో ప్రజలతో రద్దీగా ఉన్న ప్రాంతాలలో ఆటోలు, జీపులను నిలిపేందుకు అనుమతి ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ఎక్కడబడితే అక్కడ ఆటోలు, జీపులు నిలపకూడదన్న కలెక్టర్.. కేటాయించిన స్థలాల్లోనే వాహనాలను పార్కింగ్‌ చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు ప్రయాణికులకు సరిపడా ఆర్టీసీ బస్సులు ఉన్నాయా లేదా అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ సర్వీసుల కొరతపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాకు పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. సందర్శకుల కోసం మరిన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు కలెక్టర్ సూచించారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *