
- ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి
- మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు నష్టపరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
సౌదీ అరేబియా,ఐఏషియ ప్రత్యేక ప్రతినిధి: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ భయంకరమైన ప్రమాదం నుంచి కేవలం ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలతో ఒకే ఒక్క వ్యక్తి బయటపడ్డాడు. ఆ వ్యక్తి పేరు మహ్మద్ అబ్దుల్ షోయబ్(24) కాగా.. ఇతను హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ప్రమాదం సమయంలో షోయబ్ బస్సు డ్రైవర్ సమీపంలో కూర్చున్నందున ప్రమాదం నుంచి బయటపడగలిగాడు. అయితే షోయబ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని నివేదికల ప్రకారం ఈ ప్రమాదంలో షోయబ్ తన కుటుంబ సభ్యులలో చాలా మందిని కోల్పోయినట్లు తెలుస్తోంది.ఈఘోర బస్సు ప్రమాదం సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో.. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న మార్గంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 46 మంది యాత్రికులు ఉన్నట్లు భావిస్తున్నారు.ఈ మృతులలో ఒకే కుటుంబాన్ని చెందిన 18 మంది ఉన్నట్లు తెలుస్తోంది.మరణించిన 42 మంది భారతీయ యాత్రికులలో అత్యధిక మంది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందినవారే.మృతి చెందిన వారిలో 11 మంది పిల్లలు ఉన్నారు.ఈ దుర్ఘటన జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉన్నారు.
ఈ ఘటనపై పలువురు దిగ్బ్రాంతి
ఈ ఘటనపై రష్యా పర్యటనలో ఉన్న కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ ఈ ప్రమాదంలో ప్రభావితమైన భారతీయ పౌరులకు, కుటుంబాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారనే ప్రాథమిక సమాచారంతో, తక్షణమే పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీని ఆదేశించారు.
సహాయక చర్యలు
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు, సహాయక చర్యల కోసం సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. మృతుల కుటుంబాలకు సమాచారం అందించడానికి, సహాయ సహకారాలు అందించడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌదీ రాయబార కార్యాలయంతో సంప్రదించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జెడ్డాలోని భారత మిషన్ కూడా సహాయక చర్యలను సమన్వయం చేయడానికి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.
మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షలు నష్టపరిహారం
సౌదీ అరేబియాలో జరిగిన బస్సు దగ్ధమైన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ముఖ్యమంత్రి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News