న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా సోమవారం విచారణ జరిపారు. ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ఠ, హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియా, ఇ-కామర్స్ వేదికలుగా అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది జె. సాయిదీపక్ ఈ సందర్భంగా న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం 2021 ఐటీ చట్టం ప్రకారం సదరు ఖాతాలపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 22కు వాయిదా వేసింది.వ్యక్తిగత హక్కులకు భంగం కలిగేలా ఉన్న అభ్యంతరకర పోస్టులు తొలగించాలని ముందుగాసోషల్,మీడియావేదికలనుసంప్రదించాలని జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ ఈ సందర్భంగా సూచించారు. ఆ తర్వాతే న్యాయస్థానం వద్దకు రావాలన్నారు. గతంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఇలాంటి పరిస్థితే ఎదురవగా అప్పట్లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయవాది ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఇలాంటి అంశాలనే లేవనెత్తుతూ పలువురు సినీప్రముఖులు డిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో తెలుగు నటుడు నాగార్జున, బాలీవుడ్ నటులు ఐశ్వర్యరాయ్, అభిషేక్బచ్చన్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్,ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవి శంకర్ తదితరులు ఉన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News