అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ రిలీఫ్ దక్కింది. గత వైసీపీ ప్రభుత్వం సమయంలో ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందంటూ ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా ఈ కేసులో చంద్రబాబుతో పాటు మిగిలిన వారికి క్లీన్‌చిట్ ఇచ్చింది.దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.కాగా 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో నిబంధనలను ఉల్లంఘించి కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు టెండర్లు అక్రమంగా కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.114 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అప్పటి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఎండీ మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ కేసు నమోదు చేసి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడిని ఏ-25గా చేర్చింది. అలాగే అప్పటి ఫైబర్‌నెట్ చైర్మన్ వేమూరి హరికృష్ణ, ఎండీ కె. సాంబశివరావు, టెర్రాసాఫ్ట్ డైరెక్టర్ తుమ్మల గోపాలకృష్ణతో పాటు ముంబై, ఢిల్లీకి చెందిన పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వాటి ఉన్నతాధికారులను నిందితులుగా పేర్కొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News